దేశ విచ్ఛిన్నానికి మత శక్తుల కుట్ర

ABN , First Publish Date - 2022-09-08T07:53:42+05:30 IST

కుల, మత ప్రాతిపదికన చిచ్చు రగిల్చి దేశాన్ని ముక్కలు చేయడానికి మతతత్వ శక్తులు కుట్ర పన్నాయని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

దేశ విచ్ఛిన్నానికి మత శక్తుల కుట్ర

త్రివర్ణ పతాకంపై సంఘ్‌-బీజేపీ దాడి.. ప్రతి వ్యవస్థపైనా ఇంతే

ఆంగ్లేయుల పాలనే వారికి స్ఫూర్తి.. తరిమికొట్టేందుకే ఈ పాదయాత్ర

పారిశ్రామికవేత్తలకు మోదీ దాసోహం.. ఆర్థిక సంక్షోభంలో దేశం

భారత్‌ను ఐక్యంగా ఉంచేందుకు నాకు మద్దతివ్వండి: రాహుల్‌

‘భారత్‌ జోడో యాత్ర’కు కన్యాకుమారిలో శ్రీకారం

రాహుల్‌కు జాతీయ పతాకాన్ని అందించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌


చెన్నై, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కుల, మత ప్రాతిపదికన చిచ్చు రగిల్చి దేశాన్ని ముక్కలు చేయడానికి మతతత్వ శక్తులు కుట్ర పన్నాయని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం జాతీయ పతాకం ప్రమాదంలో ఉందని, దానిపై బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) దాడిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రతి వ్యవస్థపైనా దాడి జరుగుతోందని.. ఈ నేపథ్యంలో ఆయా శక్తులను తరిమికొట్టి.. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకే ‘భారత్‌ జోడో’ పాదయాత్ర చేపట్టానని తెలిపారు. ఈ కృషిలో తనకు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపిచ్చారు. బుధవారం సాయంత్రం తమిళనాడులోని కన్యాకుమారి గాంధీమండపం ప్రాంగణంలో ‘భారత్‌ జోడో యాత్ర’ను ఆయన ప్రారంభించారు. తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌  సీఎంలు ఎంకే స్టాలిన్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌ ఆయన చేతికి జాతీయ పతాకాన్ని అందించారు. పతాకానికి సెల్యూట్‌ చేసిన రాహుల్‌..700 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వరకు నడచివెళ్లారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసే ‘త్రివేణి సంగమం’ వద్ద ఏర్పాటైన ఈ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యలతో దేశం దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని, ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పి భయపెట్టాలని కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ జాతీయ పతాకాన్ని తమ వ్యక్తిగత ఆస్తిగా పరిగణిస్తున్నాయన్నారు. ‘మన త్రివర్ణ పతాకం అన్ని వర్గాలు, మతాలు, భాషలు, రాష్ట్రాలకూ చెందుతుంది. కానీ బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ దేశాన్ని మతాలు, భాషలు ప్రాతిపాదికన చీలుస్తున్నాయి. మన  పతాకం నచ్చిన మతాన్ని అవలంబించే హక్కు ను మనకు ప్రసాదిస్తోంది. ఇప్పుడది దాడికి గురవుతోంది. దేశ ప్రజలంతా మళ్లీ సమైక్యత కోరుకుంటున్నారు. ఇవాళ ఆ పతాకాన్ని చేతబూని వారి మనోభావాలను ఎలుగెత్తి చాటేందుకే భారత్‌ జోడో యాత్రను ప్రారంభించి తొలి అడుగు వేశాను’ అని పేర్కొన్నారు. దేశం మున్నెన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం ప్రబలుతోందని.. విపత్తు దిశగా దేశం పయనిస్తోందని రాహుల్‌ చెప్పారు.


ప్రసారమాధ్యమాలు సైతం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా.. బీజేపీ పాలకులకు వంత పాడుతున్నాయని ఆరోపించారు. మోదీ కొందరు పారిశ్రామికవేత్తలకు దాసోహమయ్యారని, వారి మద్దతు లేనిదే ఆయన ఒక్కరోజు కూడా ఉండలేరని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఆంగ్లేయుల పాలనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలను విభజించి పాలించేందుకే ప్రయత్నిస్తోందన్నారు. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తోందన్నారు. పాదయాత్రను ప్రారంభించేందుకు విచ్చేసి, జాతీయ పతకాన్ని అందించిన తన సోదరుడు స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.


రాజీవ్‌ చిత్రపటం ముందు ఆంధ్ర మామిడి పండ్లు

ఉదయం 7.15 గంటలకు రాజీవ్‌ స్మారకస్థలి ప్రధాన ద్వారం వద్దకు రాహుల్‌ చేరుకున్నారు. తొలుత ఆ ప్రాంతంలో ఓ మొక్క నాటారు. తర్వాత పార్టీ ప్రముఖ్యులతో కలిసి స్మారకస్థలి వద్ద రాజీవ్‌ చిత్రపటం ముందు పుష్పగుచ్ఛం ఉంచి తండ్రికి నివాళులర్పించారు. స్మారకస్థలి చుట్టూ ప్రదక్షిణం చేసి, అక్కడే కూర్చున్నారు. రాజీవ్‌ చిత్రపటం ముందుంచిన మామిడి పండ్లను ఆసక్తిగా గమనించిన రాహుల్‌.. వాటిని ఎందుకుంచారని పక్కన ఉన్న నేతలను ప్రశ్నించారు. ఆంరఽధకు చెందిన ఆ మామిడి పండ్లంటే రాజీవ్‌కు చాలా ఇష్టమని, ఆయన మరణించేరోజు కూడా ఎన్నికల ప్రచారానికి బయల్దేరే ముందు వాటిని ఆరగించారని, అందుకే ప్రత్యేకంగా తెప్పించి పెట్టామని వారు వివరించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు గాయత్రి వీణావాద్య కచేరి నిర్వహించారు. ఆ సందర్భంగా ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్న రాహుల్‌.. పావుగంట తర్వాత హఠాత్తుగా లేచి స్మారకస్థలి ఎదుట నిలిచి కొద్దిసేపు చేతులు జోడించి నమస్కరించారు. గాయత్రికి ధన్యవాదాలు తెలిపారు.


తర్వాత కారులో మీనంబాక్కం విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో తిరువనంతపురం వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్యాకుమారి చేరుకుని.. 3.30 గంటలకు అక్కడున్న తిరువళ్లువర్‌ విగ్రహం, వివేకానంద రాక్‌ మెమోరియల్‌ను సందర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆయనకు స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సీనియర్‌ నేతలు పి.చిదంబరం, శశిథరూర్‌, దిగ్విజయ్‌సింగ్‌, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, మణిశంకర్‌ అయ్యర్‌, టి.సుబ్బిరామిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు కేఎస్‌ అళగిరి రేవంత్‌రెడ్డి, శైలజానాథ్‌, డీకే శివకుమార్‌, పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీఎంకే సీనియర్‌ నేత టీఆర్‌ బాలు, కేఎన్‌ నెహ్రూ తదితరులు హాజరయ్యారు. భారత్‌ జోడో యాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోతుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. దీనివల్ల పార్టీ జవసత్వాలు తిరిగి పుంజుకుంటుందన్న ఆకాంక్ష వ్యక్తంచేశారు. కన్యాకుమారిలో జరిగిన సభలో ఆమె సందేశాన్ని చదివి వినిపించారు. కాగా, రాహుల్‌ ప్రారంభించిన ‘భారత్‌ జోడో యాత్ర’పై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా భర్త రాబర్ట్‌ వాద్రా బుధవారం పోస్టు చేసిన పోస్టర్‌ రాజకీయంగా కలకలం రేపింది. దానిపైన హస్తం గుర్తుతో పాటు సోనియా, రాజీవ్‌గాంధీ, ప్రియాంక, రాహుల్‌తో వాద్రా నిలబడి ఉన్న ఫొటో, ఈ పోస్టర్‌ను స్పాన్సర్‌ చేసిన ఎన్‌ఎ్‌సయూఐ నాయకుడు జేబీ అభిజిత్‌ ఫొటో కూడా ఉన్నాయి. భారత్‌ జోడో అంటూ వాద్రా ట్వీట్‌ చేశారు. దీంతో ఇది భారత్‌ జోడో యాత్ర కాదు.. ‘పరివార్‌ జోడో యాత్ర’ అని బీజేపీ ఎద్దేవాచేసింది.


‘విద్వేషం, విభజన’కు తండ్రిని కోల్పోయాను: రాహుల్‌

చెన్నై, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘విద్వేషం, విభజన రాజకీయాల కారణంగా నా తండ్రిని కోల్పోయాను. కానీ నేను అధికంగా ప్రేమించే ఈ దేశాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోను’ అంటూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ద్వేషాన్ని ప్రేమతో అధిగమించవచ్చని, భయాన్ని ఆత్మ విశ్వాసంతో జయించవచ్చని, కలసికట్టుగా అడ్డంకులను అధిగమిద్దామని ప్రజలకు పిలుపిచ్చారు. భారత్‌ జోడో యాత్ర ప్రారంభానికి మంగళవారం రాత్రే చెన్నైకి  చేరుకున్న ఆయన.. బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్‌లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకస్థలి వద్ద కన్నీటితో అంజలి ఘటించారు.  


5 నెలలు ఈ కంటైనర్‌లోనే!

కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు మొత్తం 5 నెలల పాటు 3,570 కిలోమీటర్ల మేర రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. ఇది సాగినంత కాలం ఆయన ఓ కంటైనర్‌లో గడపనున్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన బస చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు హోటళ్లు సిద్ధం చేయబోగా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. దీంతో క్యారవాన్‌లాంటి కంటైనర్లను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇందులో బెడ్‌, ఏసీ, మరుగుదొడ్డి తదితర సదుపాయాలు ఉన్నాయి. రాహుల్‌తో పాటు మరో 119 మంది సీనియర్‌ నేతలు  ఆయన వెంట పాదయాత్రలో పాల్గొననున్నారు. వారందరి కోసం మొత్తం 60 క్యారవాన్లను సిద్ధం చేశారు. భారత యాత్రీల సగటు వయసు 38 ఏళ్లు. రోజూ 22-23 కి.మీ. పాదయాత్ర చేస్తారు.  

Read more