Congress Presidential Polls: కొత్తగా ఎన్నికయ్యే కాంగ్రెస్ అధ్యక్షుడు కీలుబొమ్మ?

ABN , First Publish Date - 2022-09-24T23:50:38+05:30 IST

న్యూఢిల్లీ: అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో (Congress Presidential Polls) గెలవబోయేది రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్

Congress Presidential Polls: కొత్తగా ఎన్నికయ్యే కాంగ్రెస్ అధ్యక్షుడు కీలుబొమ్మ?

న్యూఢిల్లీ: అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో (Congress Presidential Polls) గెలవబోయేది రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) అనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (Senior Congress leader Shashi Tharoor) కూడా నామినేషన్ వేయబోతున్నా గెహ్లాట్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మనీశ్ తివారి సహా మరికొందరు కూడా నామినేషన్లు వేయవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ అయిన సెప్టెంబర్ 30 నాటికి ఎవరెవరు బరిలో ఉన్నారనేది తేలిపోతుంది. 


అయితే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎవరన్నది సోనియాగాంధీ (Sonia Gandhi) నిర్ణయిస్తారని అశోక్‌ గెహ్లాట్ చెప్పడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడెవరైనా నిర్ణయాలు తీసుకునేది సోనియానే అని గెహ్లాట్ చెప్పకనే చెప్పినట్లైంది. మరి కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు ఏ నిర్ణయాలు తీసుకోలేరా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లలో మెదలుతున్నాయి. 


కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని, నెహ్రూ కుటుంబానికి సంబంధించిన పార్టీ అని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తుంటాయి. గత రెండు దశాబ్దాల్లో సోనియా ఎక్కువకాలం, రాహుల్ కొంత కాలం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా కొనసాగారు. ఈ సారి సోనియా కుటుంబేతరులే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని రాహుల్ కోరుతున్నారు. అందుకే ఆయన బరిలో ఉండటం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోనియా కుటుంబేతరులు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా నిర్ణయాలు తీసుకునేది మాత్రం సోనియాయే అని గెహ్లాట్ చెప్పేశారు. మరి కొత్త అధ్యక్షుడికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండదా? అన్ని నిర్ణయాలూ సోనియాయే తీసుకుంటే కొత్త అధ్యక్షుడు ఏం చేస్తారు? సరిగ్గా ఇవే ప్రశ్నలు ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. 


గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు యూపిఏ అధ్యక్షురాలిగా అన్ని నిర్ణయాలూ సోనియావే అని తరచూ బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు.  రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్ధిపై సోనియా నిర్ణయిస్తారని చెప్పి గెహ్లాట్ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. వాస్తవానికి ఆయన మొదట్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎం పదవి కూడా చేపట్టాలని భావించారు. అయితే సోనియా, రాహుల్ ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధనతో చెక్ పెట్టడంతో పార్టీ అధ్యక్ష పదవికే పరిమితమౌతానని గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సీపీ జోషిని ప్రతిపాదించాలని, తన ప్రత్యర్థి సచిన్ పైలట్‌కు అవకాశం ఇవ్వరాదని గెహ్లాట్ భావించారు. దీనిపై తన అభిప్రాయాన్ని సోనియా, రాహుల్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మొదటి నిర్ణయమే గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఉండబోతోంది. మున్ముందు ఎలా ఉంటుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Updated Date - 2022-09-24T23:50:38+05:30 IST