Congress president poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ తప్పదా?

ABN , First Publish Date - 2022-09-14T18:58:17+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తుండటంతో గాంధీయేతర

Congress president poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ తప్పదా?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తుండటంతో గాంధీయేతర నేత బరిలో దిగే అవకాశాలపై చర్చ ఉత్కంఠభరితంగా జరుగుతోంది. పార్టీని ప్రక్షాళన చేయాలని, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అయితే అధిష్ఠాన వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఈ పదవిని అప్పగించడంపై దృష్టిసారించిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై ఆయన కూడా లోలోపల సంతోషిస్తున్నారని తెలుస్తోంది. 


ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్, ప్రచారం, మీడియా) జైరామ్ రమేశ్ తిరువనంతపురంలో మాట్లాడుతూ, అక్టోబరు 17న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనప్పటికీ, ‘అందరూ దృష్టి సారించే నేత’గా సోనియా గాంధీ కొనసాగుతారని, అదేవిధంగా రాహుల్ గాంధీ ‘సైద్ధాంతిక దిక్సూచి’గా ఉంటారని చెప్పారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై ఏకాభిప్రాయం రావాలన్నారు. వేరొకరు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడితే రాహుల్ గాంధీ వెనుక సీటు నుంచి డ్రైవింగ్ చేస్తారా? అని అడిగినపుడు జైరామ్ బదులిస్తూ, రాహుల్ గాంధీ గొప్ప ప్రజాస్వామికవాది అని, సర్దుబాటు చేసుకునే తత్వంగలవారని చెప్పారు. అధిష్ఠాన వర్గం సంస్కృతిని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావించినపుడు జైరామ్ రమేశ్ స్పందిస్తూ, అధిష్ఠాన వర్గం లేని పార్టీ అరాచకమవుతుందన్నారు. 


ఇదిలావుండగా, కాంగ్రెస్‌లోని మరికొందరు నేతలు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబ సభ్యులు కానీ, ఇతరులు కానీ ఎన్నికల్లో నిలబడినప్పటికీ, తాము కూడా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఒకరు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసి తీరాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్ అధిష్టాన వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గెహ్లాట్ వ్యవస్థలో చురుగ్గా వ్యవహరించగలరని, ఆయన కులం కూడా పార్టీకి కలిసి వస్తుందని, కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నత స్థాయి హుందాతనంగల నేత అని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


గెహ్లాట్ (73) కూడా ఆ పదవిని చేపట్టేందుకు సుముఖంగానే కనిపిస్తున్నారు. పైకి చెప్పకపోయినా లోలోపల సంతోషిస్తూ, తన వారసుని ఎంపికపై దృష్టి పెట్టారని సమాచారం. ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్ష పదవిని ఏక కాలంలో నిర్వహించడానికి వీలుండదు కాబట్టి, ఈ నెల 24 నుంచి 30 మధ్యలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తే, ముఖ్యమంత్రి పదవిని ఆయన వదులుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. అధ్యక్ష పదవికి పోటీ ఉంటే, అభ్యర్థులు ప్రదేశ్ కాంగ్రెస్ డెలిగేట్స్‌ను ప్రభావితం చేయగలిగే అధికార పదవుల్లో ఉండకూడదు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించవలసి ఉంటుంది. 


సోనియా గాంధీతో ఆగస్టు 23న అశోక్ గెహ్లాట్ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన పరిధిలోని అంశాల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని సోనియా ఆయనకు చెప్పినట్లు తెలిసింది. ఆయన కుమారుడు వైభవ్‌కు కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తామని, ఆయనకు (అశోక్ గెహ్లాట్‌కు) రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. 


జీ23 నేతల్లో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మిగిలిన నేతలంతా చురుగ్గానే ఉన్నారు. బరిలో నిలవడానికి ప్రజాస్వామిక, చట్టపరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ తప్పదనిపిస్తోంది.


Updated Date - 2022-09-14T18:58:17+05:30 IST