Alagiri question: రాజకీయాలు సరే... ప్రజా సమస్యలపై చర్చించారా?

ABN , First Publish Date - 2022-08-10T13:40:12+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) రాష్ట్రగవర్నర్‌ను కలుసుకోవడం ఆయన వ్యక్తిగతమైన విషయమే అయినా రాజకీయాల గురించి

Alagiri question: రాజకీయాలు సరే... ప్రజా సమస్యలపై చర్చించారా?

                                   - రజనీకి టీఎన్‌సీసీ నేత అళగిరి ప్రశ్న


చెన్నై, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) రాష్ట్రగవర్నర్‌ను కలుసుకోవడం ఆయన వ్యక్తిగతమైన విషయమే అయినా రాజకీయాల గురించి చర్చలు జరిపి, ప్రజాసమస్యలపై ఎందుకు ప్రస్తావించలేకపోయారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS Alagiri) నిలదీశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఉదయం తెన్‌కాశి జిల్లా కుట్రాలం వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 75.కి.మీల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ.. తమిళ ప్రజలకు చాలా చేయాలనుకుంటున్నట్టు గవర్నర్‌ చెప్పడం సంతోషంగానే ఉందని, అయితే రాష్ట్ర ప్రజలంతా నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుకుంటున్నారని, ఈ విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారో అర్థం కావటం లేదని అన్నారు. ఇదే విధంగా రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆరుశాతం పన్నుల రూపేణా నిధులు రాబట్టుకుంటున్నా, ప్రజా సంక్షేమ పథకాలకు 2 శాతం నిధులు మాత్రమే ఇచ్చి మిగిలిన నిధులివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ విషయాలను కూడా రజనీ గవర్నర్‌(Governor)తో ప్రస్తావించి ఉంటే బాగుండేదని, ఒక వేళ ఈ విషయాలపై చర్చలు జరిపి ఉంటే ఆ వివరాలను వెల్లడించాలని అళగిరి(Alagiri) డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన వీసీల సదస్సు జరుపనున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ప్రకటించడం హర్షణీయమని, విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో గవర్నర్‌ జరుపుతున్న రాజకీయాలకు అడ్డుకట్ట వేసేలా ఆ సదస్సులో తగు మార్పులు ప్రతిపాదించాలని అళగిరి డిమాండ్‌ చేశారు.


పాదయాత్ర ప్రారంభం

రాష్ట్ర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య దినోత్సవాలను పురస్కరించుకుని తెన్‌కాశి జిల్లా కుట్రాలం వద్ద మంగళవారం ఉదయం 75 కి.మీల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను కేఎస్‌ అళగిరి ప్రారంభించారు. ఇదే విధంగా యూత్‌కాంగ్రెస్ కార్యకర్తల సైకిల్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పళనినాడార్‌, మాజీ ఎంపీ రామసుబ్బు, ఎస్‌ఎం ఇదయతుల్లా(SM Idayatullah) తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్ర పాపనాశం వరకూ కొనసాగుతుందని పార్టీ నిర్వాహకులు ప్రకటించారు.చెన్నైలో మైలాపూరు శాంథోమ్‌చర్చి వద్ద పాదయాత్రను టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌ సౌత్‌చెన్నై జిల్లా శాఖ నాయకుడు అడయార్‌ డి.దురై తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T13:40:12+05:30 IST