Kapil Sibal రాజీనామాను సీరియస్‌గా తీసుకోని Congress

ABN , First Publish Date - 2022-05-26T00:40:37+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామాపై ఆ పార్టీ ఆచితూచి..

Kapil Sibal రాజీనామాను సీరియస్‌గా తీసుకోని Congress

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ (kapil sibal) రాజీనామా (Resign)పై ఆ పార్టీ ఆచితూచి స్పందించింది. ఇలాంటి వాటిని మరీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో సువిశాలమైన పార్టీ కాంగ్రెస్ అని, వివిధ రాష్ట్రాల్లో అనేక మంది నేతలు పార్టీలో చేరుతూనే ఉన్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ (kc Venugopal) అన్నారు. రాజస్థాన్‌లోని 'చింతన్ శివర్' తరువాత కూడా పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడుతుండటంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, రెండ్రోజుల క్రితమే హర్యానాలో ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని గుర్తు చేశారు. అయితే ఇలాంటి తాజా పరిణామాలను మాత్రం ఎవరూ ప్రముఖంగా చూపించడం లేదన్నారు.


సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు కపిల్ సిబల్ బుధవారం నామినేషన్ వేశారు. దీనిపై వేణుగోపాల్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి సిబల్ రాజీనామా చేసినప్పటికీ తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. సీనియర్ నేతలకు చోటిచ్చేందుకు కాంగ్రెస్ ‌వద్ద రాజ్యసభ సీట్లు లేకపోవడం వల్ల రాజ్యసభ సీటును ఆశిస్తూ కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి ఉండొచ్చా అనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు వేణుగోపాల్ నిరాకరించారు. ''కొన్ని ఎదురుదెబ్బలు తగులుంటాయి. వాటి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం. వాటిని అధిగమిస్తాం'' అని ఆయన చెప్పారు. బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-26T00:40:37+05:30 IST