Chamchagiri : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు... క్షమాపణకు బీజేపీ డిమాండ్....

ABN , First Publish Date - 2022-10-06T19:36:33+05:30 IST

కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ (Udit Raj) ట్విటర వేదికగా రాష్ట్రపతి

Chamchagiri : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు... క్షమాపణకు బీజేపీ డిమాండ్....

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్  (Udit Raj) ట్విటర వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్‌కు తన వ్యాఖ్యలతో సంబంధం లేదని ఉదిత్ స్పష్టం చేశారు.


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 3న మన దేశంలో శ్వేత విప్లవం, ఉప్పు తయారీ గురించి ప్రస్తావించారు. పాల ఉత్పత్తి, వినియోగంలో భారత దేశం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. పాడి రైతుల సహకార సంఘాలు పాల ఉత్పత్తిలో పోషించిన పాత్ర వల్ల ఈ ఘనత మనకు దక్కిందన్నారు. అదేవిధంగా మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఉప్పులో 76 శాతం ఉప్పు గుజరాత్‌లో ఉత్పత్తి అవుతోందన్నారు. గుజరాత్‌లో ఉత్పత్తి అవుతున్న ఉప్పును భారతీయులంతా తింటున్నారని చెప్పవచ్చునన్నారు. 


దీనిపై ఉదిత్ రాజ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ద్రౌపది ముర్ము వంటి రాష్ట్రపతి ఏ దేశానికీ ఉండకూడదన్నారు. చెమ్చాగిరి చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. 70 శాతం మంది ప్రజలు గుజరాత్ ఉప్పు తింటున్నారని ఆమె చెప్తున్నారని దుయ్యబట్టారు. జీవితమంతా మీరు ఉప్పు తింటూనే జీవిస్తే, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందన్నారు. 


బీజేపీ ఆగ్రహం

ఉదిత్ రాజ్ (Udit Raj) వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా (Shehzad Poonawalla) స్పందిస్తూ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అవమానించే చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రయోగించిన భాష అన్ని హద్దులను మీరిందని చెప్పారు. 


బీజేపీ నేత టామ్ వడక్కన్ స్పందిస్తూ, ఉదిత్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిని అందరూ గౌరవించాలని అభిప్రాయపడ్డారు. ఆ పదవిని నిర్వహిస్తున్నవారిపై ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. 


వ్యక్తిగత వ్యాఖ్యలే...

తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఉదిత్ రాజ్ స్పందిస్తూ, రాష్ట్రపతి ముర్ముపై తన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని చెప్పారు. తాను వ్యక్తిగతంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్మును అభ్యర్థిగా నిలిపి, ఆదివాసీ మహిళను ఎన్నికల్లో నిలిపామని చెప్తూ, ఓట్లు అడిగారని గుర్తు చేశారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత ఆదివాసీ అనేదేమీ ఉండదన్నారు. దేశానికి రాష్ట్రపతి అయితే గిరిజనులకు కూడా ప్రతినిధేనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలమంటూ పదవిని చేపట్టి, ఆ తర్వాత మౌనంగా ఉండేవారిని  చూసి ఏడుపు వస్తుందని చెప్పారు. 


గతంలో అధిర్ రంజన్...

ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి జూలైలో మాట్లాడుతూ, ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నారు. దీంతో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధిర్ రంజన్ దిగి వచ్చి, క్షమాపణ చెప్పారు. 


Updated Date - 2022-10-06T19:36:33+05:30 IST