కాంగ్రెస్‌ స్వయంకృతమే!

ABN , First Publish Date - 2022-09-27T07:38:52+05:30 IST

రాజస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం చేసుకున్న స్వయంకృత అపరాధాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్‌ స్వయంకృతమే!

అనాలోచిత నిర్ణయాలతోనే రాజస్థాన్‌లో అనర్థం!.. 2018లో పైలట్‌ను కాదని గహ్లోత్‌కు సీఎం పగ్గాలు


రాజస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం చేసుకున్న స్వయంకృత అపరాధాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న యువనేత సచిన్‌ పైలట్‌ పార్టీని విజయపథంలో నడిపారు. ఆయన్నే సీఎంగా చేయాలని రాహుల్‌గాంధీ పట్టుబట్టారు. కానీ ఆయనకు పాలనానుభవం లేదంటూ.. సోనియాగాంధీ అశోక్‌ గహ్లోత్‌కు పగ్గాలు అప్పగించారు. వాస్తవానికి 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయాక ఆయన క్రియాశీలంగా లేరు. యువతకు అవకాశమిచ్చి పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో గహ్లోత్‌కు పదవి కట్టబెట్టడం అధిష్ఠానం చేసిన మొదటి తప్పని విశ్లేషకులు చెబుతున్నారు. ‘అంతకుముందు అసోంలో కూడా హిమంత బిశ్వ శర్మను కాదని.. వృద్ధ నేత తరుణ్‌ గొగోయ్‌కే మళ్లీ పగ్గాలు ఇచ్చారు. దాంతో శర్మ కాంగ్రె్‌సను వదిలి బీజేపీలో చేరిపోయారు. మొత్తం ఈశాన్య భారతం మొత్తం బీజేపీ వైపు మొగ్గడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే సందర్భంలో పైలట్‌ను గహ్లోత్‌కు డిప్యూటీ సీఎంగా చేయడం కూడా తప్పేనని.. వారిద్దరూ ముఖముఖాలు కూడా చూసుకోని పరిస్థితి ఏర్పడిందని.. పార్టీ వర్గాలుగా చీలిపోయిందని అంటున్నారు. 18 మంది ఎమ్మెల్యేలతో 2020లో బహిరంగంగానే తిరుగుబాటుచేశారు. గహ్లోత్‌ ప్రభుత్వ పతనం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ రాహుల్‌, ప్రియాంకాగాంధీ వాద్రా కలిసి పైలట్‌ను సముదాయించారు. ఇది కూడా తప్పేనని విశ్లేషకుల భావన. 


పైలట్‌ను అక్కడి నుంచి ఢిల్లీ తీసుకొచ్చి ఏఐసీసీలో బాధ్యతలు అప్పగించి ఉండాల్సింది. రాష్ట్రంలోనే ఉంచడం వల్ల వారి మధ్య వైరం పెరిగిందే తప్ప తగ్గలేదు’ అని చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చేపట్టడం మరో తప్పని అంటున్నారు. 3,570 కిలోమీటర్ల ఈ పాదయాత్రను కొత్త అధ్యక్షుడు చేపడితే బాగుండేది. కానీ రాహులే దానికి సారథ్యం వహిస్తుండడం.. గాంధీ కుటుంబేతరుడు అధ్యక్ష పీఠమెక్కినా.. అసలు అధికారం రాహుల్‌దేనని స్పష్టమైంది. అలాగే గహ్లోత్‌ ఆంతర్యాన్ని సోనియా, రాహుల్‌ పసిగట్టలేకపోయారని చెబుతున్నారు. తన అభిప్రాయం తెలుసుకోకుండానే పైలట్‌ను సీఎంను చేయాలంటూ తీర్మానం చేసి పంపాలని సోనియా ఆదేశించడం ఆయనకు మనస్తాపం కలిగించింది. రేపు తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా తనకెలాంటి స్వేచ్ఛా ఉండదని ఆయనకు అర్థమైంది. అందుకే విశ్వాసపాత్రుడు కాస్తా రెబల్‌ మారారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఇక ఛత్తీ్‌సగఢ్‌ వంతు!

కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్న ఛత్తీ స్‌గఢ్‌లోనూ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్షుడు భూపేశ్‌ బఘేల్‌, సీనియర్‌ నేత టీఎస్‌ సింగ్‌దేవ్‌ మధ్య సీఎం పీఠంపై ఒప్పందం కుదిర్చింది. చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. మూడున్నరేళ్లు దాటినా బఘేల్‌ స్థానంలో అవకాశం ఇవ్వలేదు.ళ ఇక్కడ అసమ్మతి రేగే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. - సెంట్రల్‌ డెస్క్‌.


కార్యకర్తల మద్దతు నాకే ఉంది : శశిథరూర్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీపడే విషయంలో తనకు దేశవ్యాప్తంగా కార్యకర్తల మద్దతు ఉందని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. తాను కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని వారు కోరుకుంటున్నారని థరూర్‌ తెలిపారు. కాగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ సంక్షోభం నేపథ్యంలో బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఎన్నికల ప్రహసనాన్ని నమ్మి ఇంకా పోటీలో ఉన్న థరూర్‌కు సంతాపం ప్రకటిస్తున్నామని అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా వ్యాఖ్యానించారు.


సింధియానూ ఇలాగే..

2018లోనే మధ్యప్రదేశ్‌లో పార్టీని గెలిపించిన జ్యోతిరాదిత్య సింధియాను కాదని.. కమల్‌నాథ్‌ను గద్దెనెక్కించారు. సింధియాకు ఏ పదవీ దక్కకుండా చేశారు. దీంతో ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీలో చేరిపోయారు. అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. సింధియా కేంద్ర మంత్రి అయ్యారు. గత ఏడాది పంజాబ్‌లో నాటి సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ సారథ్యంలో ప్రభుత్వం సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆయన పొడగిట్టని నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఎన్నికల ముంగిట కెప్టెన్‌ను తొలగించి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీని  సీఎంను చేశారు. తనకు ఆ పదవి ఇవ్వనందుకు సిద్ధూ నానా రచ్చ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణమయ్యారు.

Read more