కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే!

ABN , First Publish Date - 2022-10-01T08:25:55+05:30 IST

రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత, సోనియా కుటుంబ విధేయుడు మల్లికార్జున ఖర్గే (80) శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ పత్రాలను దాఖలుచేశారు.

కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే!

విధేయతకు పట్టం.. పెద్దాయనకే పగ్గాలు ఖాయం


అధ్యక్ష పదవికి ఎన్నికలు ఇక లాంఛనమే

జీ-23 నేతల మద్దతూ 80ఏళ్ల వృద్ధ నేతకే..

పనిచేసిన దళితకోణం.. కర్ణాటకపై గురి

నామినేషన్లు వేసిన శశిథరూర్‌, ఖర్గే, త్రిపాఠీ

ప్రధాన పోటీలోని ఇద్దరూ దక్షిణాది నేతలే


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత, సోనియా కుటుంబ విధేయుడు మల్లికార్జున ఖర్గే (80) శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ పత్రాలను దాఖలుచేశారు. అనూహ్యంగా ఖర్గే పోటీకి దిగడంతో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ బరి నుంచి వైదొలిగారు. మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని ఆయన సమర్థించారు. ఆయన  నామినేషన్‌ పత్రాలపై దిగ్విజయ్‌ సింగ్‌తోపాటు మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్‌ సింగ్‌ హూడా, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, అధికార ప్రతినిఽధి అభిషేక్‌ మనూ సింఘ్వీ, మాజీ కేంద్రమంత్రి అజయ్‌ మాకెన్‌ వంటి హేమాహేమీలు సంతకాలు చేశారు.


తిరువనంతపురం లోక్‌ సభ సభ్యుడు శశి థరూర్‌, జార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠీ కూడా తమ నామినేషన్లు సమర్పించారు. ఖర్గేతో పాటు అధిష్ఠానం ఎవరికీ మద్దతునీయడం లేదని రిటర్నింగ్‌ అధికారి మఽధుసూధన్‌ మిస్త్రీ ప్రకటించినప్పటికీ శుక్రవారం దృశ్యం అందుకు భిన్నంగా కనిపించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలంతా  ఖర్గేకు మద్దతునీయడంతో ఆయనకు పరోక్షంగా అధిష్ఠానం మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది. జార్ఖండ్‌ నేత త్రిపాఠీ నామమాత్రంగానే పోటీలో దిగారని, అసలు పోటీ ఇద్దరు దక్షిణాది నేతలు ఖర్గే, శశిథరూర్‌ల మధ్యే ఉంటుందని  కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడైన ఖర్గే తమకు పూర్తి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో గాంధీల కుటుంబం ఆయనను రంగంలోకి దించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ వర్గం తిరుగుబాటు చేయడం, ముకుల్‌ వాస్నిక్‌ జీ-23 నేతల్లో భాగంగా సోనియాకు అసమ్మతి లేఖ రాయడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చివరకు ఖర్గే వైపే మొగ్గు చూపిందని తెలుస్తోంది. గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌....సోనియాగాంధీని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పోటీలో దిగాల్సిందిగా అర్ధరాత్రి ఖర్గేకు వేణుగోపాల్‌ చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ కోరిక ప్రకారం ఖర్గే ఒకే వ్యక్తి- ఒక పదవి సూత్రం ప్రకారం రాజ్యసభలో పార్టీ నాయకత్వాన్ని వదులుకుంటారని, ఆయన స్థానంలో దిగ్విజయ్‌ సింగ్‌కు కానీ చిదంబరంకు కానీ అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు తెలిపాయి. సౌమ్యుడైన ఖర్గే.. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు 1999, 2004, 2013లలో మూడుసార్లు ప్రయత్నించినా, సఫలం కాలేకపోయారు. రాజకీయ కారణాల వల్ల ఎస్‌ఎం కృష్ణ, ధరమ్‌సింగ్‌, సిద్దరామయ్యలకు అప్పట్లో ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. కర్ణాటకలోని గుల్బర్గాలోని వార్‌ వట్టిలో ఒక పేద దళిత కుటుంబంలో మల్లికార్జున ఖర్గే జన్మించారు. బీఏ డి గ్రీ తర్వాత లా చేశారు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు, 1969లో విద్యార్థి దశలో కాంగ్రెస్‌లో చేరారు. గుల్బర్గా సిటీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన నాటినుంచీ అంచెలంచెలుగా పైకి ఎదిగారు. 1972 నుంచి తొమ్మిదిసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 2009లో లోక్‌సభ సభ్యుడుగా పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కార్మిక, రైల్వే మంత్రిగా ఉన్నారు. 2014లో కూడా ఆయన తిరిగి గుల్బార్గా నుంచి రెండోసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవిత కాలంలో 2019లో తొలిసారి పరాజయం పొందారు. అయినా, అధిష్ఠానం రాజ్యసభకు పంపి పార్టీ నాయకుడుగా ఎంపికచేసింది.


హిందీ, ఇంగ్లీషులలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఖర్గే...అజాత శత్రువుగా పేరు పొందారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ గెలిచే అవకాశం కాస్త ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. కర్ణాటకలో తన అవకాశాలను మెరుగుపరుచుకునే ఆలోచనలో భాగంగా కూడా ఖర్గేను రంగంలోకి దించినట్టు భావిస్తున్నారు. 


దక్షిణాదికి మళ్లీ చాన్స్‌..

పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి,  దామోదరం సంజీవయ్య. కె.కామరాజ్‌, నిజలింగప్ప, పీవీ నరసింహారావు దక్షిణాది నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఖర్గే ఎంపికైతే ఈ బాధ్యతలు చేపట్టిన ఏడవ దక్షిణాది కాంగ్రెస్‌ నేతగా గుర్తింపుపొందుతారు. సంజీవయ్య,  నిజలింగప్ప, జగ్జీవన్‌రామ్‌ దళితులనుంచి కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. కాంగ్రెస్‌ పగ్గాలు చేపడితే.. ఈ వరుసలో ఖర్గే నాలుగో నేత అవుతారు. అయితే ఖర్గే తనను తాను దళితుడుగా ఏనాడూ చెప్పుకోలేదు. ‘‘నన్ను దళితుడు అనకండి...కాంగ్రెస్‌ నాయకుడుగానే చూడండి’’ అని ఆయన పలుసార్లు చెప్పారు. బౌద్ధమతాన్ని అనుసరించే ఖర్గే వివాదాల జోలికిపోని సాత్వికుడుగా పేరుపొందారు. 

Read more