Congress President Election : సోనియా గాంధీ విదేశీయానం... ఎన్నికల షెడ్యూలుపై ఇంకా జరగని నిర్ణయం...

ABN , First Publish Date - 2022-08-24T19:41:02+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగవలసిన సమయంలో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు

Congress President Election : సోనియా గాంధీ విదేశీయానం... ఎన్నికల షెడ్యూలుపై ఇంకా జరగని నిర్ణయం...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగవలసిన సమయంలో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఆ పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ససేమిరా అంటుండటంతో ఏకాభిప్రాయంగల నేతను ఎంపిక చేసేందుకు అన్వేషణ పూర్తి కాలేదు. దీంతో ఎన్నికల షెడ్యూలును ప్రకటించడానికి ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) అనుమతి కోసం ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ వేచి చూస్తోంది. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ సెప్టెంబరు 20తో పూర్తి కావలసి ఉంది. ఇదిలావుండగా, ఇటీవల మరొక వాదన కూడా తెరపైకి వచ్చింది. అదేమిటంటే, సోనియా గాంధీని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగిస్తూ, ప్రతి జోన్‌కు ఓ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలి. గాంధీయేతరులకు ఆ పదవిని ఇవ్వవలసి వస్తే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌లలో ఒకరికి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. షెడ్యూల్డు కులాలవారికి ఇవ్వాలనుకుంటే సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున ఖర్గే, మీరా కుమార్‌ల పేర్లను పరిశీలించాలని కొందరు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పట్ల విధేయత, కర్ణాటక శాసన సభ ఎన్నికల దృష్ట్యా ఖర్గేకు ఇవ్వాలని మరికొందరు సూచించినట్లు సమాచారం. 


2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలవడంతో ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని 23 మంది నేతలు లేఖ రాయడంతో తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సోనియా చెప్పారు. కానీ ఆ పదవిలో కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమెను కోరింది. 


ఆరోగ్య పరిస్థితుల రీత్యా తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని సోనియా గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ ఆ పదవిని చేపట్టేందుకు తిరస్కరిస్తున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదని తెలుస్తోంది. 


Updated Date - 2022-08-24T19:41:02+05:30 IST