Rajasthan Political Crisis: గెహ్లాట్ తీరుతో కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం.. కమల్‌నాథ్‌కు పిలుపు

ABN , First Publish Date - 2022-09-26T19:53:31+05:30 IST

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో బెట్టుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీరుతో కాంగ్రెస్ హై కమాండ్ ఆగ్రహంగా ఉంది.

Rajasthan Political Crisis: గెహ్లాట్ తీరుతో కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం.. కమల్‌నాథ్‌కు పిలుపు

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో బెట్టుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీరుతో కాంగ్రెస్ హై కమాండ్ ఆగ్రహంగా ఉంది. రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌తో గెహ్లాట్ సమావేశమై చర్చలు జరిపారు. అయితే తనకు మద్దతుగా రాజీనామా చేసిన వంద మంది ఎమ్మెల్యేలు సచిన్‌పైలట్‌ను సీఎంగా ఒప్పుకోవడం లేదని కూడా గెహ్లాట్ తేల్చి చెప్పారు. చర్చల తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. పార్టీలో ఐక్యత అతి ముఖ్యమని చెప్పారు. రాజస్థాన్‌లో తాజా పరిస్థితిపై నివేదికను అధిష్టానానికి అందజేస్తానన్నారు. మరోవైపు గెహ్లాట్ తీరుతో విసిగిపోయిన అజయ్ మాకెన్ ఆయన్ను కలవకుండానే జైపూర్ హోటల్ నుంచి వెళ్లిపోయారని తెలిసింది. ఢిల్లీలోనే మాట్లాడుకుందామని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. 


గెహ్లాట్-పైలట్‌పై రచ్చ జరుగుతుండటంతో అధిష్టానం చివరకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌కు కబురంపింది. అర్జంటుగా ఢిల్లీ రావాలని కోరింది. రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత కమల్‌నాథ్‌కు అప్పజెబుతారని తెలుస్తోంది. అదే సమయంలో గెహ్లాట్‌‌కు చెక్ పెట్టేందుకు కమల్‌నాథ్‌ను పిలిచారని పరిశీలకులు భావిస్తున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా గెహ్లాట్ తీరుతో రగడ ఏర్పడింది. గెహ్లాట్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ వద్దని, గెహ్లాట్ వర్గీయుడే ఉండాలని గెహ్లాట్‌కు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇప్పటికే వంద మంది దాకా రాజీనామాలు చేసి స్పీకర్ సీపీ జోషికి అప్పగించారు. సీపీ జోషిని సీఎం చేయాలని గెహ్లాట్ తలపోస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం సచిన్ పైలట్ వైపు మొగ్గు చూపుతోంది. కానీ గెహ్లాట్ వర్గీయులు పడనీయడం లేదు. చివరకు అధిష్టానం పరిశీలకులను కూడా లెక్కచేయడం లేదు. దీంతో కన్నెర్ర చేసిన అధిష్టానం పంచాయితీని ఢిల్లీలోనే తేల్చుకోవాలనుకుంటోంది. అటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా గెహ్లాట్ పేరు పరిశీలించవద్దని, మరో విధేయుడిని, సీనియర్ కాంగ్రెస్ నేతను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది. 


Updated Date - 2022-09-26T19:53:31+05:30 IST