China dating apps: చైనాలో ఆందోళనలు.. డేటింగ్‌ యాప్‌లతో సమాచారం షేరింగ్‌

ABN , First Publish Date - 2022-11-30T02:52:35+05:30 IST

చైనాలో ‘జీరో కొవిడ్‌ పాలసీ’కి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. శుక్రవారం శాంతియుతంగా సాగిన ఆందోళనలు.. పోలీసుల ప్రతిచర్యల కారణంగా క్రమంగా ఉధృతరూపు దాలుస్తున్నాయి.

China dating apps: చైనాలో ఆందోళనలు.. డేటింగ్‌ యాప్‌లతో సమాచారం షేరింగ్‌

సోషల్‌ మీడియాలో సర్కారు కత్తిరింపులతో

ప్రత్యామ్నాయ మార్గాల్లో పౌరుల పోస్టులు

చైనాలో ‘జీరో కొవిడ్‌ పాలసీ’కి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. శుక్రవారం శాంతియుతంగా సాగిన ఆందోళనలు.. పోలీసుల ప్రతిచర్యల కారణంగా క్రమంగా ఉధృతరూపు దాలుస్తున్నాయి. చైనా మైక్రోబ్లాగింగ్‌, మెసేజింగ్‌ యాప్‌లపై సర్కారు నిఘా పెడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను తొలగిస్తున్న నేపథ్యంలో పౌరులు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో సమాచారాన్ని షేర్‌ చేసేందుకు, ఆందోళనల ఫొటోలు, వీడియోలను పోస్టు చేసేందుకు డేటింగ్‌ యాప్‌లను వాడుతున్నారు. వీటితోపాటు.. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌)ను వినియోగిస్తున్నారు. ‘గ్రేట్‌ ఫైర్‌వాల్‌ ఆఫ్‌ చైనా’ వీపీఎన్‌నూ క్రాక్‌ చేసే అవకాశాలున్నా.. తక్కువ సమయంలో ఎక్కువ మందికి సమాచారం అందేలా పౌరులు జాగ్రత్తపడుతున్నారు. వీటితోపాటు.. ప్రభుత్వం నిషేధించిన ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లు, టెలిగ్రామ్‌, ట్విటర్‌లో సమాచారాన్ని షేర్‌ చేస్తున్నారు.

కోడ్‌ భాషలో..

ప్రధాన నగరాల్లో పౌరులు ఆందోళనల షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారాన్ని కోడ్‌ భాషలో షేర్‌ చేస్తున్నట్లు చైనాకు చెందిన పలు టెలిగ్రామ్‌ గ్రూపులు, చానళ్ల అడ్మిన్లు వివరించారు. ‘‘షాంఘైలో మంగళవారం ఉదయం ఆందోళన చేయాలని నిర్ణయించాం. పోలీసులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆ సమాచాన్ని తెలుసుకుని, అప్రమత్తమవుతున్నారు. అందుకే.. ప్రాంతాల ఫొటోలు.. సమయం మాత్రమే పోస్ట్‌ చేస్తున్నాం’’ అని వివరించారు. ట్విటర్‌లోనూ ‘టీచర్‌ లీ.. ఈజ్‌ నాట్‌ యువర్‌ టీచర్‌’ అనే పేరుతో ఓ యూజర్‌ ఎప్పటికప్పుడు చైనా ఆందోళనల సమాచారాన్ని ప్రపంచానికి అందజేస్తున్నారు. ఆందోళనకారులు డేటింగ్‌ యాప్‌లు, వీపీఎన్‌లను వినియోగిస్తూ.. సమాచారాన్ని చేరవేస్తున్నారనే అంతర్జాతీ య వార్తా సంస్థల కథనాలతో చైనా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ పౌరుల నుంచి స్మార్ట్‌ఫోన్లను లాక్కొని, వారు విదేశాల యాప్‌లు.. ముఖ్యంగా ట్విటర్‌, టెలిగ్రామ్‌ వాడుతున్నారా? నిషేధిత వీపీఎన్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో వాటిని పరిశీలిస్తున్నారు.

వైట్‌ పేపర్‌ ఆందోళనలు.. షేర్లు పతనం

ప్రధాన నగరాల్లో పౌరులు వైట్‌ పేపర్లను ప్లకార్డుల మాదిరిగా ప్రదర్శిస్తూ.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2020లో హాంకాంగ్‌ విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన సందర్భంలో చైనా సర్కారు ప్లకార్డులపై.. ముఖ్యంగా తెల్లకాగితాలపై రాతలతో కూడిన ప్రదర్శనలపై నిషేధం విధించింది. దీన్ని ఉల్లంఘించినవారికి కఠిన శిక్షలు విధిస్తోంది. దీంతో.. ‘జీరో కొవిడ్‌ పాలసీ’ వ్యతిరేక నిరసనల్లో పౌరులు వైట్‌పేపర్‌తో ఆందోళనలు చేస్తున్నారు. దీనికి ‘వైట్‌ పేపర్‌ రివల్యూషన్‌’ అని పేరుపెట్టారు. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు షాంఘైలోని టీ-మాల్‌లో మంగళవారం ఉదయం నుంచి ఏ4 కాగితాల విక్రయాలను నిలిపివేశారు.

(సెంట్రల్‌ డెస్క్‌)

Updated Date - 2022-11-30T02:52:36+05:30 IST