దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై అధ్యయనానికి కమిషన్‌

ABN , First Publish Date - 2022-10-08T08:56:13+05:30 IST

చారిత్రకంగా ఎస్సీలుగా ఉండి.. మధ్యలో మతం మార్చుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై అధ్యయనానికి కేంద్రప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిషన్‌ను నియమించింది.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై అధ్యయనానికి కమిషన్‌

సుప్రీం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాలకృష్ణన్‌ సారథ్యం

సభ్యులుగా మాజీ ఐఏఎస్‌ రవీంద్రకుమార్‌, యూజీసీ ప్రొఫెసర్‌ సుష్మా 

రెండేళ్లలో నివేదిక ఇవ్వాలని గెజిట్‌ జారీ


న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): చారిత్రకంగా ఎస్సీలుగా ఉండి.. మధ్యలో మతం మార్చుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై అధ్యయనానికి కేంద్రప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిషన్‌ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ సారథ్యం వహించే ఈ త్రిసభ్య కమిషన్‌లో మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రవీంద్రకుమార్‌ జైన్‌, యూజీసీ ప్రొఫెసర్‌ సుష్మా యాదవ్‌ సభ్యులుగా ఉంటారని కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కమిషన్‌ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. చైర్‌పర్సన్‌ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేళ్లలో నివేదిక సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గతంలో ఎస్సీలుగా ఉండి.. హిందూ, సిక్కు, బౌద్ధమతాలు కాకుండా ఇతర మతాలు అవలంబించే ఎస్సీలను ఎస్సీలుగా పరిగణించరాదని 341వ అధికరణ కింద జారీచేసిన రాజ్యాంగ (షెడ్యూల్‌ కులాలు) ఆదేశాలు-1950లో పేర్కొన్నారు. అయితే ముస్లిం, క్రైస్తవ మతాలు స్వీకరించిన దళితులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని పలు ముస్లిం, క్రిస్టియన్‌ గ్రూపులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. మతం మారిన దళితుల అలవాట్లు, కట్టుబాట్లలో మార్పులు, సామాజిక వివక్ష, పేదరికం పరిస్థితి మొదలైనవాటిని త్రిసభ్య కమిషన్‌ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే వీరికి ఎస్సీ హోదా ఇస్తే ప్రస్తుత షెడ్యూల్‌ కులాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జస్టిస్‌ బాలకృష్ణన్‌ సుప్రీంకోర్టుకు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి అన్న సంగతి తెలిసిందే. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గానూ పనిచేశారు.


గతంలోనూ కమిషన్‌

హిందువుల్లోనే అస్పృశ్యత అనే సామాజిక దురన్యాయం ఉన్నందున.. 1950లో హిందువుల్లో దళితులను మాత్రమే షెడ్యూల్డ్‌ కులాల కేటగిరీలో చేరుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర మతాలు స్వీకరించిన దళితులను ఎస్సీలుగా పరిగణించరాదని పేర్కొన్నారు. తర్వాత 1956లో సిక్కు దళితులకు, 1990లో బౌద్ధ దళితులకూ ఎస్సీ హోదా ఇచ్చారు. దీంతో క్రైస్తవం, ఇస్లాం పుచ్చుకున్న దళితులనూ ఎస్సీలుగా పరిగణించాలని డిమాండ్లు ముమ్మరమయ్యాయి. యూపీఏ ప్రభుత్వం మతపరమైన, భాషాపరమైన మైనారిటీల కోసం రిటైర్డ్‌ జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా నేతృత్వంలో ఓ కమిషన్‌ను నియమించింది. ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై అధ్యయనానికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజీందర్‌ సచ్చర్‌ నేతృత్వంలో మరో కమిషన్‌ను నియమించారు. క్రైస్తవం, ఇస్లాంలోకి మారినప్పటికీ దళితుల సామాజిక పరిస్థితి మారలేదని సచ్చర్‌ కమిషన్‌ తన నివేదికలో తెలిపింది. మతంతో నిమిత్తం లేకుండా దళితులందరికీ రిజర్వేషన్‌ సౌకర్యాలు అందాలని సూచించింది. అయితే ఈ వాదనను బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. సుప్రీంకోర్టులో గత ఆగస్టు 30న విచారణ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరేంటో అక్టోబరు 11న తెలియజేయాలని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. దానికి కొద్దిరోజుల ముందు  జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిషన్‌ను నియమించడం గమనార్హం.

Updated Date - 2022-10-08T08:56:13+05:30 IST