రైతుల నుంచి నీటి చార్జీలు వసూలు చేయండి

ABN , First Publish Date - 2022-12-30T01:06:22+05:30 IST

రైతుల నుంచి నీటి చార్జీలు వసూలు చేసుకోవచ్చని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది.

రైతుల నుంచి నీటి చార్జీలు వసూలు చేయండి

ఎంత నీరు తోడుతున్నారో రోజువారీగా చెప్పాలి

3 ప్రాజెక్టులపై తెలంగాణకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి నీటి చార్జీలు వసూలు చేసుకోవచ్చని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఆ సొమ్మును భవిష్యత్తులో ప్రాజెక్టుల నిర్వహణకు వినియోగించుకోవాలని తెలిపింది. గత నెలలో జరిగిన కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సమావేశంలో ముక్తేశ్వర్‌ (చిన్న కాళేశ్వరం), చనాక-కొరాట ప్రాజెక్టులు, చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ సమావేశవివరాలను మినిట్స్‌ రూపంలో కేంద్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం పాటించాల్సిన కీలక సూచనలు చేశారు. అందులో ప్రధానంగా రైతుల నుంచి నీటి చార్జీలు వసూలు చేయవచ్చని స్పష్టం చేశారు. భాగస్వామ్య నీటి పారుదల నిర్వహణను ప్రోత్సహించాలని, వాటర్‌ యూజర్‌ అసోసియేషన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు ఉంచాలని తెలిపారు. చనాక-కొరాట, ముఖ్తేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి నీటిని తోడుకునే వివరాలను రోజూవారీగా జీఆర్‌ఎంబీకి సమాచారమివ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర అధికారులు సూచించారు. రియల్‌ టైమ్‌ టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. చనాక-కొరాట ప్రాజెక్టుకు అవసరానికి మించి ఎక్కువ సామర్థ్యం గల పంపులు బిగించారని పేర్కొన్నారు. అయినప్పటికీ డీపీఆర్‌లో పేర్కొన్న పరిమితికి మించి నీటిని తోడుకోవద్దని, మొత్తం 1.5 టీఎంసీల నీటినే తోడుకోవాలని సూచించారు. అందులో తెలంగాణకు 1.2 టీఎంసీలు, మహారాష్ట్రకు 0.3 టీఎంసీలని తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులకు చట్టబద్ధమైన అన్ని అనుమతులు పొందాలని సూచించారు. మరోవైపు, ముక్తేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు 12 రెట్లు పెరిగినప్పటికీ అందుకు తగినట్లు ఆదాయం పెరగలేదని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం ప్రతినిధి ప్రస్తావించారు. మిగతా 26 శాతం పనుల పూర్తికి విధించుకున్న కాలవ్యవధిపై ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి పలు సందేహాలు లేనెత్తారు. దానికి ప్రధానంగా భూసేకరణ సమస్యలు కారణమని తెలంగాణ ప్రభుత్వం అదనపు ప్రధాన కార్యదర్శి సమాధానం ఇచ్చారు.

Updated Date - 2022-12-30T01:11:49+05:30 IST