కాల్వల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి

ABN , First Publish Date - 2022-07-07T15:44:15+05:30 IST

వరద కాల్వల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయమంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్థానిక అధికారులను ఆదేశించారు. కాంచీపురం జిల్లాలో రూ.120.75 కోట్లతో

కాల్వల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి

- సీఎం స్టాలిన్‌ ఆదేశం

- కాంచీపురం జిల్లాలో వరద నిరోధక పనుల పరిశీలన


చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): వరద కాల్వల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయమంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్థానిక అధికారులను ఆదేశించారు. కాంచీపురం జిల్లాలో రూ.120.75 కోట్లతో చేపడుతున్న వరద నిరోధక పనులను సీఎం స్టాలిన్‌ బుధవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. కుండ్రత్తూరు తాలూకా కొలుత్తువాన్‌చేరి రహదారిలో రూ.16.70 కోట్లతో నిర్మిస్తున్న వాననీటి కాల్వ పనులను ఆయన పరిశీలించారు. ఇదేవిధంగా పోరూరు చెరువు నుంచి అదనపు జలాలు ప్రవహించే కాలువకు రూ.34 కోట్లతో చేపడుతున్న మరమ్మతు పనులను, తాంబరం సమీపం అడయార్‌ వాగు సమీపంలో నివసిస్తున్న ప్రజలను వరదల నుండి కాపాడేందుకు రూ.70.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాల్వల నిర్మాణపు పనులను పరిశీలించారు. సీఎంతోపాటు మంత్రులు దురైమురుగన్‌, దామో అన్బరసన్‌, శాసనసభ్యుడు సెల్వ పెరుంతగై, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం. ఆరతి తదితరులు పర్యటించారు. 


శ్రీలంకకు పోలీసుశాఖ విరాళం రూ. 1.40 కోట్లు

  ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రజలను ఆదుకునే నిమిత్తం రాష్ట పోలీసు శాఖ రూ.1.40 కోట్ల విరాళం ప్రకటించింది. ఆ మేరకు బుధవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకుని డీజీపీ శైలేంద్రబాబు రూ.1.40 కోట్ల చెక్కును అందజేశారు. డీజీపీతోపాటు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌, సీబీసీఐడీ డీజీపీ మహమ్మద్‌ షకీల్‌ అక్తర్‌, తాంబరం పోలీసు కమిషనర్‌ ఎ.అమల్‌రాజ్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్ర పోలీసులు తరఫున రూ.1.34 కోట్లు, పోలీసు ఉన్నతాధికారుల తరఫున రూ.6.63 లక్షలను శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు విరాళాలుగా అందించినట్లు డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2022-07-07T15:44:15+05:30 IST