రాష్ట్రంలో Tamil సాహితీ గ్రంథాల సముదాయం

ABN , First Publish Date - 2022-03-16T15:53:12+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆశయాన్ని నెరవేర్చేలా రాష్ట్రంలో తమిళ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలు ఒకే చోట లభించేలా భారీ స్థాయిలో గ్రంథాల సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు

రాష్ట్రంలో Tamil సాహితీ గ్రంథాల సముదాయం

- సీఎం స్టాలిన్‌ ప్రకటన 

- తమిళ పండితులకు అవార్డుల ప్రదానం 


చెన్నై: దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆశయాన్ని నెరవేర్చేలా రాష్ట్రంలో తమిళ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలు  ఒకే చోట లభించేలా భారీ స్థాయిలో గ్రంథాల సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. చేపాక్‌లోని కలైవానర్‌ అరంగంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022వ సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో విశిష్టసేవలందించిన తమిళ పండితులు, ప్రముఖులకు ప్రభుత్వం తరఫున అవార్డులను ఆయన ప్రధానం చేశారు. ఈ సభకు మంత్రి తంగం తెన్నరసు అధ్యక్షత వహించారు. ఈ సభలో స్టాలిన్‌ మాట్లాడుతూ... తన తండ్రిబాటలోనే తమిళ భాషాభివృద్ధికి, తమిళ పండితుల సంక్షేమానికి తాను కూడా పాటుపడుతున్నానని, పదేళ్లుగా ప్రభుత్వం తరఫున తమిళ పండితులు, ప్రముఖులు, సంస్థలకు ఇచ్చే అవార్డులను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనవరి 21న పదేళ్లకు సంబంధించిన అవార్డులను తమిళ పండితులు, ప్రముఖులకు ప్రదానం చేశానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పది నెలల్లోపే తమిళ భాషాభివృద్ధికి తనవంతు సేవలందించానని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక పరీక్షల్లో తమిళ భాషలో ప్రవేశం ఉండాలని ఉత్తర్వు జారీ చేశానని,  ఉపాధ్యాయులు, వైద్య ఉద్యోగులు, పోలీసులు సహా అన్ని శాఖలకు సంబంధించి  ఉద్యోగాల భర్తీలో తమిళభాషను నిర్బంధం చేశామన్నారు. ఆలయాల్లో తమిళ అర్చనలు ప్రవేశపెట్టడం, తమిళ్‌తల్లి ప్రార్థనను రాష్ట్ర గీతంగా ప్రకటించడం, విదేశీ విశ్వవిద్యాలయాల్లో తమిళ పీఠాలను నెలకొల్పడం ఇలా డీఎంకే ప్రభుత్వ తమిళ భాషకు ఎనలేని సేవలందిస్తోందన్నారు. ఈ యేడాది పెరియార్‌, అంబేడ్కర్‌ అవార్డుల క్రింద ఇస్తున్న నగదు పురస్కారాన్ని లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచామని, తక్కిన అవార్డు గ్రహీతలకు ఇచ్చే నగదు పురస్కారాన్ని లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచామని తెలిపారు. తమిళ పండితులకు తన చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేయడం తనకు ప్రత్యేక కీర్తి లభించినట్లుగానే ఆనందిస్తున్నానని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిఽధి ఆశయం మేరకు భారీ బుక్‌ పార్కును ఏర్పాటు చేస్తానని, అందుకు అనువైన స్థలాన్ని ఎంపికచేస్తామని అవార్డులందుకున్న పండితుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 


అవార్డు గ్రహీతలు...

ఈ సభలో తిరువళ్లువర్‌ అవార్డును ప్రముఖ తమిళ పండితుడు ఎం.మీనాక్షిసుందరం, పెరియార్‌ అవార్డును రచయిత కె.తిరునావుక్కరసు, అంబేడ్కర్‌ అవార్డును హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రూ, అన్నా అవార్డును నాంజిల్‌ సంపత్‌, కామరాజర్‌ అవార్డును టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కుమరి అనంతన్‌, మహాకవి భారతి అవార్డును భారతి కృష్ణకుమార్‌, భారతిదాసన్‌ అవార్డును ప్రొఫెసర్‌ సెంతలై గౌతమన్‌, కి.ఆ.పే. విశ్వనాథన్‌ అవార్డును తమిళ పండితుడు ఎం. రాజేంద్రన్‌, కంబర్‌ అవార్డును భారతి భాస్కర్‌, సొల్లిన్‌ సెల్వర్‌ అవార్డును సూర్యా జేవియర్‌,  జీయూ పోప్‌ అవార్డును ఏఎస్‌ పన్నీర్‌సెల్వంకు, ఉమర్‌పులవర్‌ అవార్డును మదురై ఎన్‌ మహమ్మద్‌, ఇలంగోవడిగళ్‌ అవార్డును నెల్లై కన్నన్‌, పావనార్‌ అవార్డును కె.అరసేంద్రన్‌,  సింగారవేలర్‌ అవార్డును మదుక్కూర్‌ రామలింగం, మరైమలర్‌ అడిగళార్‌ అవార్డును ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సుకి శివం, వళ్ళలార్‌ అవార్డును ఇరా సంజీవిరాయర్‌, అయోధ్యదాస పండితర్‌ అవార్డును జ్ణాన అలాయసిస్‌, ముఖ్యమంత్రి కంప్యూటర్‌ తమిళ అవార్డును ప్రొఫెసర్‌ ధనలక్ష్మి స్వీకరించారు. సిపాఆదిత్తనార్‌ అవార్డును ‘ఉయిర్‌మై’ సంచిక నిర్వాకులు, తమిళత్తాయ్‌ అవార్డును మలేషియ తమిళ రచయితల సంఘం నిర్వాహకులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సామినాధన్‌, ఎస్‌ఎస్‌ శివశంకర్‌, ఎన్‌. కయల్‌విళి, మేయర్‌ ప్రియారాజన్‌, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌, తమిళభాషాభివృద్ధి, సమాచార శాఖ కార్యదర్శి మహేశన్‌ కాశిరాజన్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ అధ్యక్షుడు ఖాదర్‌మొయిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-16T15:53:12+05:30 IST