Chief Minister: ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-09-27T15:09:16+05:30 IST

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సమయంలో కురిసే భారీ వర్షాల కారణంగా ఏర్పడే వరద ముప్పు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికార

Chief Minister: ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు

- ‘వరద ముప్పు’పై ముందస్తు చర్యలు

- ప్రజలు ఇబ్బందిపడకుండా పటిష్ఠ ఏర్పాట్లు

- అధికారులకు సీఎం దిశానిర్దేశం


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 26: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సమయంలో కురిసే భారీ వర్షాల కారణంగా ఏర్పడే వరద ముప్పు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆదేశించారు. సోమవారం ఆయన అధ్యక్షతన ఈశాన్య రుతుపవనాల సమయంలో కురిసే భారీ వర్షాలు, వాటివల్లే ఏర్పడే వరద ముప్పు సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంపై ట్రిప్లికేన్‌లోని కలైవానర్‌ అరంగంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గత యేడాది అధికారం చేపట్టిన తర్వాత ఎన్నడూ చూడని విధంగా వరద ముప్పు సమస్య ఎదుర్కొన్నామని, ఇది మనకందరికీ ఓ కనువిప్పులాంటిదన్నారు. గత యేడాది వరదల్లో చెన్నై మహానగరం వరద నీటిలో చిక్కుకుందన్నారు. ఇలాంటి పరిస్థితి మరోమారు నగరంలో పునరావృతం కారాదన్న గట్టి నిర్ణయం తీసుకుని, తదనుగుణంగా అనేక రకాలైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఈశాన్య రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో ప్రవేశించనున్నాయని, ఈ కాలంలో కురిసే భారీ వర్షాల వల్ల ఏర్పడే వరద ముప్పును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లాల యంత్రాంగాలను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు సహా మంత్రులు దురైమురుగన్‌, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, ఏవీ వేలు, కేఎన్‌ నెహ్రూ, రామచంద్రన్‌, పెరియకరుప్పన్‌, అనితా రాధాకృష్ణన్‌, సెంథిల్‌ బాలాజీ, ఎం.సుబ్రమణ్యం, పళనివేల్‌ త్యాగరాజన్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


చెరువుల నీటి మట్టాలపై  కన్నేయండి..

ముఖ్యంగా చెన్నైనగరానికి మంచినీటిని సరఫరా చేసే చెరువుల్లో ఒకటైన చెంబరంబాక్కంలో సగం వరకే నీరు నిల్వ ఉన్నట్టు తెలిసిందన్నారు. అదేవిధంగా మిగిలిన చెరువుల నీటి మట్టాలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. చెరువులోకి వచ్చే నీరు, బయటకు వదిలే నీటిని నిశితంగా పర్యవేక్షించాలన్నారు. భారీ వర్షాలు, వాటి కారణంగా ఏర్పడి వదర ముప్పు ప్రభావిత జిల్లాల్లో అధికారులు అక్కడే బస చేయాలని, తమకు కేటాయించిన జిల్లాలకు అధికారులు వెళ్లి  పరిస్థితి అంచనా వేసి తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దఫా చెన్నై నగరంలో వర్షపు నీరు నిలిచే అవకాశం రాదని తాను గట్టిగా భావిస్తున్నానన్నారు. 


అధికారులంతా సమన్వయంతో... 

వర్షాకాలంలో స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వర్ష, వరద బాధిత ప్రాంతాలకు చెందిన ప్రజలతో కలిసి పనిచేయాలన్నారు. ప్రతి కార్పొరేషన్‌లో 24 గంటల పాటు సేవలు అందించేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత యేడాది వాతావరణ శాఖ ఆలస్యంగా హెచ్చరించింది. ఈ దఫా ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను తెలుసుకోవడమేకాకుండా ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. 


ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించండి...

ఒకవేళ వర్ష, వరద బాధిత ప్రాంతాలకు చెందిన బాధితులను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించాలని భావిస్తే ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బాఽధితులకు పునరావాస కేంద్రాల్లో అవసరమయ్యే తాగునీరు, ఆహారం, విద్యుత్‌, వైద్య ఆరోగ్య సదుపాయాలను  ఏర్పాటు చేసుకోవాలన్నారు.  ప్రతి పునరావాస కేంద్రానికి ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించుకోవాలన్నారు. క్లిష్ట సమయాల్లో సమస్యల్లో చిక్కుకున్న అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.  


ప్రజల రక్షణే ధ్యేయంగా... 

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతిమంగా ప్రజా రక్షణే ప్రధాన ధ్యేయంగా అధికారులు అప్రమత్తతతో ఉండాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. కేవలం ఇలాంటి సమీక్షా సమావేశాల్లోనే సూచనలు, సలహాలు ఇవ్వాలన్న పనిలేదన్నారు. స్థానికంగా ఏర్పడే సమస్యలపై అధికారులే తక్షణం స్పందించి చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. 

Read more