Covid థర్డ్‌వేవ్‌పై తక్షణ చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-01-18T18:50:13+05:30 IST

కరోనా వైరస్‌ మరింతగా విస్తరించకుండా తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తిస్థాయి అప్రమత్తత పాటించాలని అధికారులను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశించారు. కొవిడ్‌ తాజా స్థితిగతులపై నగరంలో

Covid థర్డ్‌వేవ్‌పై తక్షణ చర్యలు తీసుకోండి

- హోం ఐసొలేషన్‌పై నిఘా పెట్టండి 

- వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సెలవులు ఇవ్వొద్దు 

- అధికారులకు సీఎం ఆదేశం 


బెంగళూరు: కరోనా వైరస్‌ మరింతగా విస్తరించకుండా తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తిస్థాయి అప్రమత్తత పాటించాలని అధికారులను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశించారు. కొవిడ్‌ తాజా స్థితిగతులపై నగరంలో సోమవారం సాయంత్రం ఆయన వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతోనూ, వైద్యనిపుణులతోనూ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. వర్చువల్‌గా సాగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ కూడా పాల్గొన్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న బెంగళూరులో ఓపీడీలపై అధికంగా దృష్టి సారించాలని, సిబ్బంది సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రజలు ట్రాయాజింగ్‌లో చేరకుండా నియంత్రించాలని తెలిపారు. హోం ఐసొలేషన్‌పై పరిపూర్ణ నిఘా విధించాలని, ప్రతిరోజూ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయాలన్నారు. ఇంట్లో మిగిలినవారికి వైరస్‌ సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంట్లో అలాంటి పరిస్థితి లేకపోతే, బాధితులను కొవిడ్‌ కేంద్రాలకు తరలించాలన్నారు. హోం ఐసొలేషన్‌ చికిత్స పొందుతున్న వారి ఇళ్లకే అవసరమైన ఔషధాలు అందచేయాలన్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం పొందాలని తెలిపారు. స్థానిక వైద్యులను కరోనా బాధితులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకంగా పర్యవేక్షణ జరపాలన్నారు. సంక్రాంతి అనంతరం గ్రామీణ ప్రాంతాలలోనూ కొవిడ్‌ వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైన పరిస్థితులు ఉంటే మినహా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సెలవు ఇవ్వరాదని ఆదేశించారు. ప్రస్తుతానికి డిమాండ్‌ లేనప్పటికీ అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్‌ ప్లాంట్లు, జనరేటర్లను సన్నద్ధంగా ఉంచాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు ప్రక్రియ వేగిరంగా సాగేలా చూడాలన్నారు. కొవిడ్‌ నియమావళికి సంబంధించి మీడియాలో ఎప్పటికప్పుడు జాగృతి కార్యక్రమాలు వచ్చేలా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోవాలన్నారు. 15-18 ఏళ్లవారికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ ప్రక్రియను కూడా త్వరగా లక్ష్యం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వారాంతపు కర్ఫ్యూ, నైట్‌ కర్ఫ్యూలకు సంబంధించి వైద్య నిపుణుల కమిటీ చేసిన సిఫారసులపై మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని వారంపాటు క్వారంటైన్‌కు పంపుతున్నట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాగా కొవిడ్‌ కేసులు అధికంగా ఉన్న రాజధాని బెంగళూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్తను సీఎం ఆదేశించారు. 

Updated Date - 2022-01-18T18:50:13+05:30 IST