గెహ్లోత్‌కు క్లీన్‌చిట్‌.. ఆయన వర్గంపై కొరడా!

ABN , First Publish Date - 2022-09-28T07:19:58+05:30 IST

రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం వేచిచూసే ధోరణి అవలంబించేలా కనిపిస్తోంది.

గెహ్లోత్‌కు క్లీన్‌చిట్‌.. ఆయన వర్గంపై కొరడా!

రాజస్థాన్‌ సంక్షోభంపై సోనియా ఫోకస్‌ .. పరిణామాల్లో గెహ్లోత్‌ పాత్రేమీ లేదని నిర్ధారణ

 

తిరుగుబాటుదారులపై కమశిక్షణ చర్యలు

చీఫ్‌ విప్‌, ఇద్దరు మంత్రులకు షోకాజ్‌ 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం వేచిచూసే ధోరణి అవలంబించేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక కోసం గెహ్లోత్‌ పేరు ప్రధానంగా తెరపైకి రావడం.. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సివస్తే సచిన్‌ పైలట్‌ను ఆ స్థానంలో నియమిస్తారనే అంచనాల నేపథ్యంలో గెహ్లోత్‌ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అయితే ఈ పరిణామాల వెనుక గెహ్లోత్‌ ప్రమేయం ఏమీ లేదని కాంగ్రెస్‌ పరిశీలకులు తేల్చేసి ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. అదేసమయంలో గెహ్లోత్‌ వర్గీయులైన ఇద్దరు మంత్రులు శాంతి ధావల్‌, ప్రతాప్‌ సింగ్‌ ఖచరియావాస్‌, చీఫ్‌విప్‌ కలిసి కథంతా నడిపారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సూచించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్‌వి్‌పతో పాటు ఆ ఇద్దరు మంత్రులకు అధిష్ఠానం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. తిరుగుబాటుదారులపై చర్య తీసుకోవాలని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని అరికట్టాలని పరిశీలకుల సూచన మీదటే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకూ గెహ్లోత్‌నే సీఎం పదవిలో కొనసాగించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. అంతకుముందు.. రాజస్థాన్‌ సంక్షోభంపై  సోని యా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌ నుంచి రప్పించి ఆయనతో కీలక చర్చలు జరిపారు. ఆ తర్వాత పార్టీ పరిశీలకులు మల్లిఖార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ ఇచ్చి న నివేదికను ఆమె అధ్యయనం చేశారు. అనంతరం తిరుగుబాటుదారులపై చర్యల గురించి పరిశీలించేందుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ ఏకే ఆంటోనీని ఢిల్లీ రమ్మని కోరారు. ఆంటోనీ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. అయితే పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లోత్‌ పోటీచేసే అవకాశాలు లేవని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పార్టీ నాయకత్వం చర్చలకు పిలిస్తే కలుసుకునేందుకు వీలుగా సచిన్‌ పైలట్‌ ఢిల్లీ చేరుకున్నారు.  

Read more