లంక చేరిన చైనా నిఘా నౌక

ABN , First Publish Date - 2022-08-17T06:57:56+05:30 IST

భారత ఆందోళనలను బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరుకుంది. భారత ప్రభుత్వం నుంచి ఎంతగా..

లంక చేరిన చైనా నిఘా నౌక

భారత కీలక స్థావరాలపై డ్రాగన్‌ నేత్రం

ఆందోళనలను బేఖాతరు చేస్తూ లంక అనుమతి

హంబన్‌టోట పోర్టులో లంగరు వేసిన షిప్‌

చైనా రాయబారి, లంక ఎంపీల స్వాగతం

నౌక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు


కొలంబో, ఆగస్టు 16: భారత ఆందోళనలను బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరుకుంది. భారత ప్రభుత్వం నుంచి ఎంతగా అభ్యంతరాలు వ్యక్తమయినా శ్రీలంక ప్రభుత్వం చివరికి ఆ నౌక రాకకు అనుమతి ఇచ్చేసింది. దీంతో బాలిస్టిక్‌ క్షిపణులు, ఉపగ్రహ వ్యవస్థలను సైతం ట్రాకింగ్‌ చేయగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమున్న పరిశోధన నౌక యువాన్‌ వాంగ్‌-5 మంగళవారం ఉదయం 8.20 గంటలకు శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హంబన్‌టోట నౌకాశ్రయంలో లంగరు వేసింది. వాస్తవంగా ఈనెల 11నే ఆ నౌక హంబన్‌టోటకు చేరుకునేలా ప్రయత్నాలు జరిగాయి.


భారత్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో నౌక రాకను వాయిదా వేసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం చైనాను కోరింది. యువాన్‌ వాంగ్‌-5 నౌక 22వ తేదీ వరకు హంబన్‌టోటలో నిలిపి ఉంచేందుకు శ్రీలంక ప్రభుత్వం శనివారం అనుమతి ఇచ్చింది. కాగా, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ నౌక సైంటిఫిక్‌ పరిశోధనలను చేస్తోందని, దాని వల్ల ఏ దేశ భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు ఉండబోదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం బీజింగ్‌లో చెప్పారు. మూడోదేశం ఏదీ ఈ నౌక రాకను అడ్డుకోకూడదని అన్నారు. 

Updated Date - 2022-08-17T06:57:56+05:30 IST