China Vs Taiwan : యుద్ధం భావనను చైనా సృష్టిస్తోంది : తైవాన్

ABN , First Publish Date - 2022-08-06T21:21:54+05:30 IST

చైనా (China) సైనిక విన్యాసాలు తమ స్వయంపాలిత ద్వీపంపై యుద్ధం జరుగుతున్న

China Vs Taiwan : యుద్ధం భావనను చైనా సృష్టిస్తోంది : తైవాన్

న్యూఢిల్లీ : చైనా (China) సైనిక విన్యాసాలు తమ స్వయంపాలిత ద్వీపంపై యుద్ధం జరుగుతున్న భావనను సృష్టిస్తున్నాయని తైవాన్ ఆరోపించింది. చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మీడియన్ లైన్‌ను అతిక్రమించినట్లు తెలిపింది. ఈ ద్వీపంలో వైమానిక, నావికా దళం గస్తీని పెంచింది. భూమిపైగల క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసింది. 


తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, తైవాన్ రక్షణ దళాలు అప్రమత్తమైనట్లు తెలిపింది. ఈ ద్వీపంలో గగనతలం, సముద్ర ప్రాంతాల్లో గస్తీని పటిష్టం చేసినట్లు తెలిపింది. అవసరమైనపుడు స్పందించేవిధంగా భూమిపై నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. 


అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్‌లో పర్యటించినప్పటి నుంచి చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమె పర్యటన ఏక చైనా విధానాన్ని ఉల్లంఘించిందని మండిపడింది. లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్స్ చేస్తోంది. అవసరమైతే బలప్రయోగం ద్వారా చేర్చుకోదగిన ప్రాంతంగా తైవాన్‌ను చైనా పరిగణిస్తోంది. ఇతర దేశాల నేతలు తైవాన్‌లో పర్యటించడాన్ని ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించడంగా పరిగణిస్తోంది. 


ఇదిలావుండగా, తైవాన్ సైన్యం శనివారం నాలుగు మానవ రహిత గగనతల వాహనాలను (డ్రోన్లను) కిన్‌మెన్ ప్రాంతంలో గుర్తించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ డ్రోన్లు చైనాకు చెందినవేనని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ డ్రోన్లను గమనించి, హెచ్చరిస్తూ తైవాన్ సైన్యం కాల్పులు జరిపినట్లు పేర్కొంది. 


తైవాన్ (Taiwan) అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్ (Tsai Ing-wen) ఇచ్చిన ఓ ట్వీట్‌లో, చైనా సైనిక విన్యాసాలు, సమాచార యుద్ధ కార్యకలాపాలను తమ ప్రభుత్వం, సైన్యం నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజాస్వామిక తైవాన్‌కు మద్దతివ్వాలని, ప్రాంతీయ భద్రత పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఆపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. 


Updated Date - 2022-08-06T21:21:54+05:30 IST