Chief Minister: పుదుచ్చేరిలో మళ్లీ మేమే!

ABN , First Publish Date - 2022-12-13T08:36:18+05:30 IST

పుదుచ్చేరిలో మళ్ళీ డీఎంకే అధికారంలోకి రావటం ఖాయమని, తమిళనాట తమ ద్రావిడ తరహా పాలన చూసి ఇక్కడి ప్రజలంతా మె

Chief Minister: పుదుచ్చేరిలో మళ్లీ మేమే!

- సీఎం స్టాలిన్‌ జోస్యం

చెన్నై, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరిలో మళ్ళీ డీఎంకే అధికారంలోకి రావటం ఖాయమని, తమిళనాట తమ ద్రావిడ తరహా పాలన చూసి ఇక్కడి ప్రజలంతా మెచ్చుకుంటున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. పుదుచ్చేరిలో సోమవారం ఉదయం జరిగిన మాజీ మంత్రి శివకుమార్‌ కుమారుడు ఆనంద్‌రాజ్‌ వివాహ వేడుకలకు సీఎం స్టాలిన్‌ సతీసమేతంగా హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కలను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ ప్రాచీన కాలం నుంచి పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని, తమిళ భాషను పరిరక్షించడంలో పుదుచ్చేరి కూడా ప్రధాన పాత్ర వహించిందన్నారు. భారతీదాసన్‌, భారతీయార్‌ వంటి మహాకవులను ఆకర్షించిన ప్రాంతం కూడా ఇదేనన్నారు.

ప్రస్తుతం పుదుచ్చేరిలో ఎన్నికైన ప్రభుత్వమే ఉన్నా, కేంద్రం నుంచి నిధులు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోందని, ఇక్కడి ముఖ్యమంత్రి రంగస్వామి మంచివాడే అయినా కేంద్రంలోని బీజేపీ పాలకుల దగ్గర వంగి ఉంటున్నారన్నారు. గత పదిహేను నెలలుగా పుదుచ్చేరిలో ఎలాంటి ప్రజా సంక్షేమ పథకాలు అమలుచేయలేదని, ప్రజలంతా తమిళనాట ఉన్న డీఎంకే ద్రావిడ తరహా పాలన ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు పుదుచ్చేరి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి కుడిభుజంగా వ్యవహరించిన శివకుమార్‌ వంటి పార్టీ సేవకులున్న పుదువైలో డీఎంకే రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ వివాహ వేడుకల్లో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, సెంజి మస్తాన్‌, ఎంపీ జగద్రక్షగన్‌, పుదుచ్చేరి శాసనసభ్యులు నాసిం, అనపాల్‌ కెనడీ, నాగత్యాగరాజన్‌, సెంథిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T08:36:20+05:30 IST