Chief Minister: తిరుచ్చిలో ఒలింపిక్‌ అకాడమీ

ABN , First Publish Date - 2022-12-30T07:46:09+05:30 IST

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాష్ట్ర యువకులకు శిక్షణ అందించేందుకు తిరుచ్చి నగరంలో

Chief Minister: తిరుచ్చిలో ఒలింపిక్‌ అకాడమీ

- సీఎం స్టాలిన్‌ ప్రకటన

- రూ.238.41 కోట్లతో పథకాల ప్రారంభం

చెన్నై, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాష్ట్ర యువకులకు శిక్షణ అందించేందుకు తిరుచ్చి నగరంలో ఒలింపిక్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. ఈ అకాడమీలో యువకులకు అంతర్జాతీయ స్థాయిలో, అనుభవజ్ఞులైన కోచ్‌ల ద్వారా శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు. తిరుచ్చి అన్నా క్రీడామైదానంలో గురువారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ఆ జిల్లాలో రూ.238.41 కోట్లతో పూర్తయిన ప్రభుత్వ పథకాలను ప్రారంభించి, రూ.308.29 కోట్లతో చేపట్టనున్న పథకాలకు శంకుస్థాపన చేశారు. 22,716 మంది లబ్దిదారులకు రూ.79.06 కోట్ల విలువైన సహాయాలు పంపిణీ చేశారు. అదేవిధంగా జిల్లాలోని 2764 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.78 కోట్ల మేరకు బ్యాంక్‌ రుణాలను అందజేశారు. 33 సామాజిక సంస్థలకు మణిమేఘలై అవార్డులు, ఎనిమిది బ్యాంకులకు రాష్ట్రస్థాయి అవార్డులను కూడా ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ ... విద్యలో, ఉపాధి అవకాశాల కల్పనలో, పారిశ్రామిక ప్రగతిలో ప్రపంచ దేశాలతో రాష్ట్రం పోటీపడుతోందని, ఆ దిశగా క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలన్న ఆశయంతోనూ ఒలింపిక్‌ అకాడమీ(Olympic Academy)లు నెలకొల్పుతున్నామన్నారు. ఈ ప్రకటన క్రీడామంత్రి ఉదయనిధికే కాకుండా జిల్లా మంత్రులు కేఎన్‌ నెహ్రూ, అన్బిల్‌ మహేశ్‌కు సంతోషం కలిగిస్తుందన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా మహిళా స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన చెప్పారు.

టీఎన్‌పీఎల్‌ విస్తరణ పనుల ప్రారంభం

రూ.1,285 కోట్లతో రాష్ట్ర పేపర్‌ బోర్డు సంస్థ రెండో యూనిట్‌ విస్తరణ పనులను కూడా సీఎం ప్రారంభించారు. దీనికారణంగా కాగితపు గుజ్జు అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇప్పటివరకు జరుగుతున్న కాగితపు గుజ్జు దిగుమతి, కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక మనప్పారై సిప్కాట్‌ ఇండిస్ట్రియల్‌ పార్కుకు, పాలనాభవనానికి ప్రారంభోత్సవం చేశారు. ప్రజలవద్దకే వైద్యం పథకంలో లబ్దిదారుల సంఖ్య గురువారం కోటికి చేరింది. ఆ లబ్దిదారురాలైన తిరుచ్చి జిల్లా సన్నాసిపట్టి గ్రామ నివాసి మీనాక్షికి స్టాలిన్‌ మెడికల్‌ కిట్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T07:46:09+05:30 IST

Read more