చక్రబంధం!

ABN , First Publish Date - 2022-02-23T07:54:28+05:30 IST

ఉక్రెయిన్‌ లాంఛనంగా మూడు ముక్కలైంది. ఉక్రెయిన్‌ తూర్పు భాగంలో రష్యా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డొనెస్క్‌, లుహాన్‌స్క్‌ రాష్ట్రాలను స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతాలుగా రష్యా...

చక్రబంధం!

ఉక్రెయిన్‌ చుట్టూ లక్షన్నర మంది రష్యా సైన్యం

తూర్పు రాష్ట్రాల స్వాతంత్ర్యానికి గుర్తింపు.. పుతిన్‌ నిర్ణయానికి రష్యా పార్లమెంటు ఓకే

వాటి రక్షణ పేరుతో ఉక్రెయిన్‌లోకి అడుగు

అధికారికంగా రంగంలోకి రష్యా బలగాలు

ఇది దురాక్రమణేనన్న అమెరికా, బ్రిటన్‌ 

రష్యాపై నాటో దేశాల ఆంక్షలు

పైప్‌లైన్‌ రద్దు చేసుకున్న జర్మనీ

భద్రతా మండలిలో రష్యాకు మద్దతు కరవు

యుద్ధభయంతో కుప్పకూలిన మార్కెట్లు

చమురుకు యూరప్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

రష్యాకు పరోక్షంగా చైనా మద్దతు


మాస్కో, ఫిబ్రవరి 22: ఉక్రెయిన్‌ లాంఛనంగా మూడు ముక్కలైంది. ఉక్రెయిన్‌ తూర్పు భాగంలో రష్యా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డొనెస్క్‌, లుహాన్‌స్క్‌ రాష్ట్రాలను స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతాలుగా రష్యా గుర్తించింది. అంటే, వాటికి ఉక్రెయిన్‌తో ఎలాంటి సంబంధం లేదన్నమాట. ఈ మేరకు సోమవారమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేయగా, మంగళవారం వాటికి రష్యా పార్లమెంటు ఆమోదం లభించింది. రెండు స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు రష్యా సైన్యాన్ని అక్కడికి పంపేందుకు కూడా పార్లమెంటు ఆమోదం తెలిపింది. రష్యా బయట సైనిక బల ప్రయోగానికి అనుమతి ఇచ్చింది. అంటే, తాజాగా ఉక్రెయిన్‌లోని రెండు రాష్ట్రాలను లాక్కున్న రష్యా భవిష్యత్తులో మిగిలివున్న దేశం మీద దాడి చేసే అవకాశం కూడా ఉందన్న మాట.


మంగళవారమే రష్యా సైన్యం అధికారికంగా డొనెస్క్‌, లుహాన్‌స్క్‌ రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదార్లకు పరోక్ష సాయం అందిస్తున్న రష్యా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగినట్లయింది. రష్యాను నిలువరించేందుకు అమెరికా, ఇతర యూరప్‌ దేశాలు గత నాలుగు నెలలుగా చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో తాజాగా ఆంక్షల కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. అయితే, అవేవీ రష్యా దూకుడును తగ్గించలేక పోయాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం తెగేదాకా లాగాలని  అనుకోవడం లేదు. తాము 2014లో ఉక్రెయిన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను అంతర్జాతీయ సమాజం రష్యా భూభాగంగా గుర్తించాలని, ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరే ప్రయత్నాల నుంచి విరమించుకోవాలని డిమాండ్లు పెట్టారు. రెండింటికీ అంగీకరిస్తే ఉక్రెయిన్‌ జోలికి వెళ్లబోమని చెప్పారు. అంటే, ఇప్పటికే స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాలుగా గుర్తించిన రెండు రాష్ట్రాలు రష్యా ప్రాబల్యంలోకి వెళతాయి. మిగిలిన ఉక్రెయిన్‌ కూడా నాటో కూటమికి దూరంగా ఉంటుంది కాబట్టి ఉక్రెయిన్‌లో మోహరించిన నాటో బలగాలు వెనక్కి వెళ్లిపోతాయి. అంటే, సోవియట్‌ రష్యా నాటి భూభాగాలన్నీ రష్యా ప్రాబల్యంలోనే ఉంటాయి. ఇందుకు ఉక్రెయిన్‌ అంగీకరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.


భగ్గుమన్న పశ్చిమ దేశాలు

తిరుగుబాటుదార్ల ఆధీనంలోని రాష్ట్రాలను రష్యా స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాలుగా గుర్తించి, వాటికి రక్షణగా సైన్యాన్ని తరలించడాన్ని  అమెరికా, యూరప్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి. సోమవారం రాత్రి అత్యవసరంగా జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో రష్యాకు నేరుగా ఎలాంటి మద్దతు లభించలేదు. రష్యా చర్య తదుపరి దురాక్రమణకు సాకును సిద్ధం చేసుకున్నట్లుగా ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని మెజారిటీ దేశాలు డిమాండ్‌ చేశాయి. ఉక్రెయిన్‌ తూర్పు రాష్ట్రాల్లోకి రష్యా యుద్ధ ట్యాంకులు ప్రవేశించాయని, ఇది మారణహోమానికి దారి తీస్తుందని బ్రిటన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలన్న చైనా పుతిన్‌ తాజా నిర్ణయాలపై మాత్రం నోరు మెదపలేదు. స్వీయ భద్రత విషయంలో రష్యా ఆందోళనను కూడా గుర్తించాలని నాటో దేశాలకు హితవు పలికింది. తాము శాంతి కోసమే ప్రయత్నిస్తామని, అదే సమయంలో తమ మాతృభూమిని కాపాడుకొనే విషయంలో ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వాలడీమర్‌ జలాన్‌స్కీ ప్రకటించారు. ఉద్రిక్తతలకు అమెరికా, యూరప్‌ దేశాలే కారణమని రష్యా ఆరోపించింది. 1.2 లక్షల మంది నాటో బలగాలను ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల రాష్ట్రాల సరిహద్దుల వెంట మోహరించారని, ఇది తమను రెచ్చగొట్టే చర్యేనని తేల్చిచెప్పింది. ఉక్రెయిన్‌ విఫల రాజ్యమని, పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మ అని వ్యాఖ్యానించింది.  


ఆంక్షల కొరడా

ఉక్రెయిన్‌లోని రష్యా ప్రాబల్య రాష్ట్రాల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టరాదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తమ దేశ పెట్టుబడిదారులకు ఆదేశాలు జారీ చేశారు. రష్యా పైనా ఆంక్షలు ప్రకటించనున్నట్లు చెప్పారు. రష్యా నుంచి నుంచి తమకు వచ్చే గ్యాస్‌ పైప్‌లైన్‌ను వాడుకోరాదని జర్మనీ నిర్ణయించింది. రష్యాకు చెందిన ఐదు బ్యాంకులపై, ముగ్గురు బిలియనీర్లపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. ముగ్గురికి బ్రిటన్‌లో ఉన్న ఆస్తులను స్తంభింప జేసింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం పార్లమెంటులో ప్రకటించారు. రష్యాపై భారీ ఆంక్షలు విధించాలని ఆస్ట్రియా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. పుతిన్‌ నిర్ణయానికి మద్దతు పలికిన రష్యన్‌ పార్లమెంటు సభ్యులపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఆలస్యం చేయకుండా రష్యాపై ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ కోరింది.


ఒకప్పుడు సోవియట్‌ రష్యాలో భాగంగా ఉన్న తూర్పు యూరప్‌ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తోంది. తన మాటను పశ్చిమ యూరప్‌ దేశాలు లెక్క చేయక సైనిక ప్రాబల్యాన్ని రష్యా సరిహద్దుల వరకు విస్తరించడంతో స్వీయ భద్రతపై ఆందోళనచెందిన రష్యా  ఉక్రెయిన్‌లో అంతర్యుద్ధాన్ని ఎగదోసింది. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటిదాకా 14 వేల మంది మరణించారు. ఉక్రెయిన్‌లో నాటో లక్షా 20 వేల మంది బలగాలను మోహరిస్తే ఉక్రెయిన్‌ చుట్టూ రష్యా లక్షన్నర మంది బలగాలను మోహరించింది. తాజాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా తాను గుర్తించిన 2 రాష్ట్రాల్లోకి కూడా రష్యన్‌ బలగాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సైన్యం రష్యాతో యుద్ధానికి సిద్ధంగా లేదు. అనవసరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి, పరిస్థితిని దిగజార్చవద్దని సైన్యం అధికార ప్రతినిధి నాటో దేశాలను కోరారు.


యూర్‌పకు కష్టాలే

రష్యా తాజా నిర్ణయం నాటో దేశాలను ఆత్మరక్షణలో పడేసింది. రష్యా ప్రాబల్యాన్ని అడ్డుకొనేందుకు మరిన్ని మోహరింపులకు పాల్పడితే ఉద్రిక్తతలు పెరిగిపోతాయి. యూరప్‌ దేశాల ఇంధన అవసరాలకు కొరత ఏర్పడుతుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుంద ని భయపడుతున్నారు. ఇప్పటికే యుద్ధ భయంతో ప్ర పంచంలోని షేర్‌ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. దెబ్బ రష్యా స్టాక్‌ మార్కెట్ల మీద కూడా పడింది. దశాబ్దాలుగా చమురు అవసరాలకు రష్యాపై ఆధారపడుతున్న యూ రప్‌ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నా యి. నౌకల ద్వారా అమెరికా, ఆఫ్రికా, అరబ్‌ దేశాల నుం చి సహజ వాయువును తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. 


రష్యాకు అండగా చైనా

అమెరికా, ఇతర నాటో దేశాలు తనపై యుద్ధం వరకు వెళ్లబోవన్న నమ్మకంతోనే రష్యా ముందుకు కదిలిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రష్యా గత పదేళ్లలో తన సైన్యాన్ని పూర్తిగా ఆధునికీకరించింది. తాజాగా బెలార్‌సతో 30 వేల బలగాలను మోహరించి సైనిక విన్యాసాలతో యూర్‌పను బెంబేలెత్తిస్తోంది. యుద్ధం జరిగితే రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, పశ్చిమ దేశాలతో తల పడుతూనే రష్యా ఇటు తూర్పున చైనాతో స్నేహాన్ని బలోపేతం చేసుకుంది. ఇటీవల ఒలింపిక్స్‌ వేడుకల ముగింపు సందర్భంగా చైనా-రష్యా దేశాధినేతలు సమావేశమయ్యారు. రష్యా నుంచి చైనా చమురు, సహజ వాయువు కొనే విధంగా దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంటే, యు ద్దం కారణంగా జర్మనీ రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనక పోయినా రష్యా ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలిక ప్రభావం ఉండబోదన్నమాట.


రష్యాకు చైనా సైనిక మద్దతు అవసరం లేకున్నా రాజకీయంగా, ఆర్థికంగా చైనా దన్ను లభిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుసరించే విధానాన్నే రేపు తైవాన్‌ ఆక్రమణకు చైనా వాడుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా కలిసి దక్షిణ చైనా సముద్రంలో చైనాను ఢీకొట్టేందుకు సైనిక కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో రష్యా అండ తనకు పనికి వస్తుందని చైనా భావిస్తోంది. 


ఉద్రిక్తతలను తగ్గించడమే తక్షణ ప్రాధాన్యం

ఐరాస భద్రతా మండలి భేటీలో భారత్‌

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతను తగ్గించడమే తక్షణ ప్రాధాన్యం కావాలని ఐరాస భద్రతా మండలికి సూచించింది. దౌత్యమార్గాల్లో చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభంపై సోమవారం రాత్రి ఐరాస భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత ప్రతినిధి టి.ఎ్‌స.తిరుమూర్తి మా ట్లాడారు. ప్రపంచ శాంతి కోసం అన్ని వర్గాలు సం యమనం పాటించాలని భారత్‌ కోరుకుంటోంద న్నారు. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. 
విద్యార్థులూ వచ్చేయండి..

భారత విద్యార్థులంతా తక్షణమే ఉక్రెయిన్‌ వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ‘‘భారత విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల ఏర్పాటుపై అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. తరగతులపై వర్సిటీల నుంచి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదు రు చూడకండి. మీ భద్రత దృష్ట్ట్యా తక్షణమే ఉక్రెయిన్‌ను వీడండి’’ అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ఉక్రెయిన్‌కు వెళ్లింది. ఆ దేశానికి ఈ నెల 25 నుంచి మార్చి 6 మధ్య నాలుగు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది.

Read more