Union Minister: ఉన్నత విద్య సరళీకృతం కావాలి

ABN , First Publish Date - 2022-09-10T17:52:39+05:30 IST

దేశం అభివృద్ధి చెందాలంటే ఉన్నత విద్య సరళీకృతం కావాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Union Minister: ఉన్నత విద్య సరళీకృతం కావాలి

- కొవిడ్‌తో ప్రపంచ దేశాలు విలవిల... 

- ఆవిష్కరణల దిశగా భారత్‌

- పీఈఎస్‌ స్నాతకోత్సవంలో కేంద్రమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌


బెంగళూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశం అభివృద్ధి చెందాలంటే ఉన్నత విద్య సరళీకృతం కావాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. పీఈఎస్‌ యూనివర్సిటీ ఏడో స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ దొరస్వామి, ప్రొ-చాన్స్‌లర్‌  జవహర్‌ ముఖ్యులుగా పాల్గొన్నారు. 3,419 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ర్యాంకుల సాధించిన 92 మందికి బంగారు పతకాలను అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌(Union Minister Rajeev Chandrasekhar) మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కాలంలో జరగని ప్రగతి పదేళ్లలోనే నవభారత్‌ వికసించే దిశగా సాగుతోందని తెలిపారు. కేంద్రం వంద రూపాయలు విడుదల చేస్తే కేవలం రూ.15 మాత్రమే అందేదని, ఇటీవల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమచేయడం ద్వారా వందశాతం సద్వినియోగమవుతోందన్నారు. విద్యావ్యవస్థకు దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యం జరిగిందని, ఈ ఏడాది పది లక్షల కోట్లు కేటాయించడం ద్వారా ఆధునిక భవనాలు, మౌళిక సదుపాయాలు, ఉన్నత విద్యకు అవసరమైన సౌలభ్యాలు సాధ్యమయ్యాయన్నారు. రెండేళ్ల కొవిడ్‌ ప్రపంచ దేశాలను కుదిపేసిందని, భారత్‌లో ఆర్థిక పరిస్థితిపైనా ప్రారంభంలో ఇబ్బంది కలిగినా ప్రస్తుతం అన్నింటా అధిగమించి సరికొత్త ఆవిష్కరణల ద్వారా ప్రపంచ దేశాలకు దిశానిర్ధేశం చేస్తోందన్నారు. శక్తివంతమైన అమెరికాలో అందరికీ కొవిడ్‌ టీకా నేటికీ సాధ్యం కాలేదన్నారు. ఐటీ, బీటీ, అంతరిక్ష పరిశోధనలు, ఈ-కామర్స్‌, నిర్మాణ, స్టార్టప్‏లలోను తిరుగులేని ప్రగతి కొన్నేళ్లలోనే చూడవచ్చునని, ఆ దిశగా నేటి విద్యార్థులు పయనించాలని సూచించారు. చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ దొరస్వామి మాట్లాడుతూ పీఈఎస్‌ విద్యాసంస్థ గుణాత్మకత ప్రాధాన్యనిచ్చి ఐదు దశాబ్దాలలో లక్షలాది మందికి ఉన్నత విద్య సాధ్యం చేసిందన్నారు. ప్రతి విద్యార్థి జీవిత కాలం నేర్చుకునేందుకు ప్రాధాన్యత నివ్వాలని గుర్తుచేశారు. ఎంత స్థాయికి చేరినా మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని మరువరాదని సూచించారు. డిగ్రీలతోనే చదువు పూర్తయిందని భావించకుండా సరికొత్త ఆవిష్కరణలవైపు ఆలోచించాలన్నారు. సమాజం మనకెంతో ఇచ్చిందని, మనవంతు రుణం తీర్చుకుందామనేలా విద్యార్థులు వ్యవహరించాలన్నారు. వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ జే సూర్యప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-10T17:52:39+05:30 IST