Anil Deshmukh, Sachin Vaze కస్టడీ పొడిగింపు

ABN , First Publish Date - 2022-06-07T22:16:15+05:30 IST

మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, సస్పెండెడ్ ఏపీఐ సచిన్ వాజేల జ్యూడిషియల్..

Anil Deshmukh, Sachin Vaze కస్టడీ పొడిగింపు

ముంబై: మనీ లాండరింగ్ (money laundering) కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh), సస్పెండెడ్ ఏపీఐ సచిన్ వాజే (Sachin Vaze)ల జ్యూడిషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. దీంతో దేశ్‌ముఖ్, వాజే, సంజీవ్ పలాండే, కుందన్ షిండేలు మరో 14 రోజుల పాటు కస్టడీలోనే కొనసాగుతారు.


ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ''రూ.100 కోట్ల లంచం'' ఆరోపణలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ తదితరులపై సీబీఐ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది. దేశ్‌ముఖ్‌తో పాటు ఆయన సిబ్బంది కుందన్ షిండే, సంజీవ్ పలాండేల పేర్లను అందులో చేర్చింది. నేరపూరిత కుట్ర కింద ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, ప్రొవిజన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో సచిన్ వాజే అప్రూవర్‌గా మారి, క్షమించాల్సిందిగా కోరడాన్ని ముంబై కోర్టు జూన్ 1న అనుమతించింది. సీబీఐ ఇంటరాగేషన్‌కు తాను సహకరిస్తానని కోర్టుకు వాజే తన దరఖాస్తులో విన్నవించారు. కొన్ని షరతుల మీద వాజే విజ్ఞాపనను అనుమతించిన కోర్టు జూన్ 7న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ముంబై కోర్టు అనుమతితో వాజే అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ విట్నెస్‌గా ఆయన సాక్ష్యమిస్తారు.


దేశ్‌ముఖ్‌పై కేసు ఇదే...

ముంబై పోలీస్ కమిషనర్‌గా పరం బీర్ సింగ్‌ను తొలగించడంతో ఆయన 2021లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఒక లేఖ రాశారు. ముంబైలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలనెలా రూ.100 కోట్లు వసూలు చేయాల్సిందిగా తను అనిల్ దేశ్‌ముఖ్ (అప్పటి హోం మంత్రి) ఆదేశించినట్టు ఆ లేఖలో ఆయన పేర్కొనడం సంచలనమైంది. విధినిర్వహణలో దేశ్‌ముఖ్, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు సక్రమంగా వ్యవహరించ లేదనడానికి, అవినీతి ప్రవర్తనకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. అనంతరం 2021 నవంబర్‌లో దేశ్‌ముఖ్‌ను సీబీఐ అరెస్టు చేయడంతో ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలుకు ఆయనను తరలించారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ సైతం దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించింది. తనపై వచ్చిన ఆరోపణలను దేశ్‌ముఖ్ ఖండించినప్పటికీ, ఆయనపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది హోం మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు.

Updated Date - 2022-06-07T22:16:15+05:30 IST