Chief Minister: కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ?

ABN , First Publish Date - 2022-08-23T17:59:29+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కేబినెట్‌లో మేజర్‌సర్జరీ ఖాయమని

Chief Minister: కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ?

- అధిష్టానం పెద్దల సానుకూలత

- ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గ కూర్పు

- పార్టీలోనూ ప్రక్షాలన

- సెప్టెండర్ 8న జనోత్సవ


బెంగళూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కేబినెట్‌లో మేజర్‌సర్జరీ ఖాయమని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. విస్తరణ కసరత్తు ఇప్పటిది కాదు. సీఎం బొమ్మై ఇదే అంశంపై పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలిశారు. పలు కారణాలతో ఇది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎన్నికలు సమీపిస్తుండడంతో అట్టే వాయిదా వేయకుండా కేబినెట్‌లో ఉన్న ఐదు ఖాళీలను పూర్తి చేసేందుకు బొమ్మైకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు సమాచారం. మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa)ను అత్యున్నత పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించిన రోజే బొమ్మై కేబినెట్‌ ప్రక్షాళనకు సంబంధించి కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కులాల సమీకరణల ఆధారంగా మంత్రివర్గ కూర్పు చేయదలిచారు. ఉపముఖ్యమంత్రి పదవులను సృష్టించడం ద్వారా ఎన్నికల్లో ఆయా వర్గాలను ఆకర్షించేందుకు కూడా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతలంతా ఒక టీమ్‌గా పనిచేయాలని ఇప్పటికే అధిష్టానం పెద్దలు రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు. కేబినెట్‌లో ఎలాంటి మార్పులు జరిగినా అంగీకరించాలని, పార్టీ వేదికల్లో తప్ప మరెక్కడా చర్చించరాదని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లోపాయికారీగా స్పష్టమైన సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి పదవులను సృష్టించే అంశంపై ఇంకా అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు లేవని అంటున్నారు. గతంలో జగదీశ్‌శెట్టర్‌(Jagdish Shetter) సీఎంగా ఉన్న సమయంలో రెండు ఉపముఖ్యమంత్రి పదవులను సృష్టించారు. యడియూరప్ప సీఎంగా ఉన్న వేళ ఈ సంఖ్యను మూడుకు పెంచారు. ఉపముఖ్యమంత్రి పదవులు ఆశించిన ప్రయోజనాలు ఇవ్వలేదని పైగా ఇవి ప్రభుత్వంలో అధికార కేంద్రాలుగా మారాయని గుర్తించిన అధిష్టానం పెద్దలు వీటి విషయం లో ఇంకా డోలాయమానంలో ఉన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర బీజేపీలోనూ పెద్దఎత్తున మార్పులు, చేర్పులు ఉంటాయని ఎన్నికల టీమ్‌ను దాదాపుగా సన్నద్ధం చేయబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీకి సంప్రదాయంగా వస్తున్న లింగాయత్(Lingayat) ఓట్లతోపాటు ఒక్కలిగ ఓట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లను భారీగా ఆకర్షించే దిశలో ఆయా వర్గాలకు ప్రక్షాళన వేళ సముచిత ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని ఈ వర్గాలు అంటున్నాయి. ఏ క్షణంలోనైనా అధిష్టానం రాష్ట్ర పార్టీకి నూతన అధ్యక్షుడిని ప్రకటించవచ్చునని తెలుస్తోంది. 

Updated Date - 2022-08-23T17:59:29+05:30 IST