3న మునుగోడు పోరు

ABN , First Publish Date - 2022-10-04T09:03:32+05:30 IST

ఉప ఎన్నికల భేరి మోగింది! తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలోని మరో 5 రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

3న మునుగోడు పోరు

  • 5 రాష్ట్రాల్లో మరో 6 స్థానాలకు ఉప ఎన్నికల
  • షెడ్యూలు విడుదల చేసిన ఎన్నికల సంఘం
  • నవంబరు 3న పోలింగ్‌.. 6న ఓట్ల లెక్కింపు
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ త్రిముఖ పోరు
  • బిహార్‌లో 2 స్థానాల్లో మహాకూటమికి అగ్ని పరీక్ష
  • ఉద్ధవ్‌ మనుగడపై అంధేరీ ఈస్ట్‌ ఫలితం ప్రభావం
  • నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్షణమే 
  • కోడ్‌ అమల్లోకి.. కలెక్టర్ల ప్రకటన


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, నల్లగొండ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నికల భేరి మోగింది! తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలోని మరో 5 రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్‌, బిహార్‌లోని మోకమా, గోపాల్‌ గంజ్‌, హరియాణాలోని ఆదంపూర్‌, ఉత్తర ప్రదేశ్‌ లోని గోలా గోకర్ణ్‌నాథ్‌, ఒడిసాలోని ధామ్‌ నగర్‌ స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణ గడువు 14 కాగా.. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 17. పోలింగ్‌ నవంబరు 3న.. ఓట్ల లెక్కింపు 6న నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆఖరులోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలతో ముడిపెట్టకుండా ముందుగా ఉప ఎన్నికల్లో సత్తా తేల్చుకోవాలని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ ప్రకటనతో స్పష్టమవుతోంది. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సతో తాడో పేడో తేల్చుకోవడమే కాక.. జోడోయాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేయడం, బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని మహాకూటమి భవిష్యత్తును, మహారాష్ట్రలో ఉద్దవ్‌ థాకరే నేతృత్వంలోని శివసేన భవితవ్యాన్ని తేల్చడం కూడా బీజేపీ లక్ష్యంగా కనపడుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికల జరుగుతున్న సంగతి తెలిసిందే.


ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను విజయం సాధించాలనే ఉద్దేశంతో బీజేపీ సర్వశక్తులనూ ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ఇప్పటికే రెండుసార్లు తెలంగాణకు రావడమేకాక.. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ విజయానికి ముఖ్య కారకుడైన సునీల్‌ బన్సల్‌ను కూడా ఇక్కడ రంగంలోకి దింపారు. ఆయన ఇప్పటికే పార్టీ శ్రేణులతో చర్చించి వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలయ్యేంత వరకూ పార్టీ రాష్ట్రనేతలంతా మునుగోడులోనే ఉధృత ప్రచారం చేయాలని బీజేపీ అధిష్ఠానం ఆదేశించింది. మరోవైపు.. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అక్కడ ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ రెండు పార్టీల నడుమ.. తమ సిటింగ్‌ సీట్‌ అయిన మునుగోడును నిలబెట్టుకోవడం కాంగ్రె్‌సకు, ఆ పార్టీ మనుగడకు సవాల్‌గా మారింది. 


ఆదంపూర్‌.. మరో మునుగోడు

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసినట్లుగానే హరియాణాలోని ఆదంపూర్‌లో కుల్దీప్‌ బిష్ణోయ్‌ కాంగ్రె్‌సకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నాలుగుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బిష్ణోయ్‌ను ఓడించడం, రంగంలోకి దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీని నిలువరించడం కాంగ్రె్‌సకు సవాలుగా మారింది. మునుగోడుతో పాటు ఆదంపూర్‌ సీటును కూడా కాంగ్రెస్‌ కోల్పోతే.. పాదయాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇక, బిహార్‌లోని మోకమా, గోపాల్‌ గంజ్‌ సీట్లకు జరుగుతున్న ఉప ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో జేడీయూ, ఆర్జేడీలకు పరీక్షగా మారాయి. మోకమా నుంచి గెలిచిన ఆర్జేడీ నేత అనంత్‌కుమార్‌ సింగ్‌.. ఆయుధాల కేసులో శిక్ష పడడంతో శాసనసభకు అనర్హుడయ్యారు. గోపాల్‌ గంజ్‌లో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుభాష్‌ సింగ్‌ మరణించారు. దీంతో ఆ రెండు సీట్లలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌, తదితర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన నీతీశ్‌కుమార్‌కు ఈ రెండు స్థానాల్లో గెలుపొందడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ రెండుచోట్లా మహాకూటమి గెలిస్తే..  జాతీయస్థాయిలో అది బలోపేతం అయ్యే అవకాశాలున్నందువల్ల బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.


ఠాక్రే మనుగడకు పరీక్ష..

శివసేన ఎమ్మెల్యే రమేశ్‌ లత్కే మరణించడంతో అనివార్యమైన అంధేరీ ఈస్ట్‌ ఉప ఎన్నికను.. ఉద్దవ్‌ థాక్రే, ఏక్‌ నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు రెండూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. షిండే వర్గం, బీజేపీ కలిసి ఉద్దవ్‌ ఠాక్రే పార్టీ అభ్యర్థిని ఓడిస్తే త్వరలో జరిగే బృహన్ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయానికి తగిన వాతావరణం ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం మాత్రం ఈ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే లత్కే భార్యను నిలబెట్టి సానుభూతి పవనాల ద్వారా గెలుపు సాధించాలని భావిస్తోంది.


ఆ రెండూ బీజేపీ సీట్లే?

ఒడిశాలోని ధామ్‌ నగర్‌, యూపీలోని గోలా గోకర్ణ్‌నాథ్‌ సీట్లలో సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రెండు సీట్లూ తమకు తిరిగి దక్కుతాయని బీజేపీ విశ్వాసంతో ఉంది. అయితే లఖీంపూర్‌ ఖీరీ జిల్లాలోని గోలగోరఖ్‌నాథ్‌ సీటులో బీజేపీకి ఈసారి సమాజ్‌ వాది పార్టీ గట్టి పోటీ నిచ్చే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అక్కడ రెండో స్థానం సాధించింది. కాగా.. ఈ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో చైతన్యానికి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనూ్‌పచంద్ర పాండే.. ఆలిండియా రేడియోతో కలిసి ‘ఓటర్‌ అవేర్‌నెస్‌ రేడియో సిరీ్‌స’ను సోమవారం ప్రారంభించారు. ఒక్కొక్కటీ 15 నిమిషాల చొప్పున ఉండే ఈ 52 ఎపిసోడ్‌లు ప్రతి శుక్రవారం వివిధభారతి స్టేషన్‌లో ప్రసారమవుతాయి. 


అమలులోకి ఎన్నికల కోడ్‌

ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వెనువెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు  వినయ్‌కృష్ణారెడ్డి, పమేలాసత్పథి ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడడంతో ఈ రెండు జిల్లాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొత్త పథకాల ప్రకటనలపై నిషేధం అమలుకానుంది. మునుగోడు ఉప ఎన్నికకు జిల్లా అధికారిగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి వ్యవహరించనుండగా.. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎంవీ జగన్నాథరావు వ్యవహరించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికారులు బ్యాలెట్‌ బాక్సుల ప్రాథమిక స్థాయి చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సీ)ని పూర్తి చేశారు. చండూరులో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఖరారు చేశారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను ఉంచేందుకు నల్లగొండ పట్టణం ఆర్జాలబావిలోని ఎఫ్‌సీఐ గోదాంలో స్ట్రాంగ్‌ రూంలను సిద్ధం చేశారు. నవంబరు 6న ఓట్ల లెక్కింపు సైతం నల్లగొండలోని ఎఫ్‌సీఐ గోదాంలోనే జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. నోటిఫికేషన్‌ నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ సీపీ మహే్‌షభగవత్‌.. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌, నారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి, స్థానిక పోలీసు అధికారులతో  చర్చించారు. సమస్యాత్మక ప్రాంతాలు, అసాంఘిక శక్తుల వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - 2022-10-04T09:03:32+05:30 IST