AIADMK Crisis: అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో రచ్చరచ్చ.. పన్నీర్‌సెల్వంపై బాటిళ్లు విసిరిన..

ABN , First Publish Date - 2022-06-23T22:08:07+05:30 IST

అన్నాడీఎంకేలో (AIADMK) ‘ఏక నాయకత్వం’ (Single Leadership) కోసం పన్నీరుసెల్వం (O Panneerselvam), పళనిస్వామి (Edappadi K. Palaniswami) వర్గాల మధ్య..

AIADMK Crisis: అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో రచ్చరచ్చ.. పన్నీర్‌సెల్వంపై బాటిళ్లు విసిరిన..

చెన్నై: అన్నాడీఎంకేలో (AIADMK) ‘ఏక నాయకత్వం’ (Single Leadership) కోసం పన్నీరుసెల్వం (O Panneerselvam), పళనిస్వామి (Edappadi K. Palaniswami) వర్గాల మధ్య జరుగుతున్న వర్గపోరు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పళనిస్వామి(EPS) ఆహ్వానం మేరకు ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి (AIADMK General Council Meeting) హాజరైన ఒ.పన్నీర్‌సెల్వంపై(OPS) పళనిస్వామి(EPS) వర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు వాటర్ బాటిల్స్ విసిరేసి మరీ వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. పరిస్థితులన్నీ తనకు ప్రతికూలంగా మారడంతో చేసేదేమీ లేక పన్నీరుసెల్వం (O Panneerselvam), ఆయన మద్దతుదారులు సమావేశం మధ్యలోనే అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఓపీఎస్‌ (OPS) సూచించిన 23 తీర్మానాలు రద్దయ్యాయి. ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో.. సమావేశం నుంచి పన్నీరుసెల్వం మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.జులై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలని అన్నాడీఎంకే (AIADMK) నిర్ణయించింది. అదే రోజున కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరపాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. అయితే.. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ఊరట కలిగించిన విషయం ఏంటంటే.. 23 తీర్మానాలపై మాత్రమే అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని, ఇతర విషయాలపై చర్చ మాత్రమే జరగాలని మద్రాస్ హైకోర్టు (Madras HighCourt) ఇవాళ తెల్లవారుజామున 4.20 నిమిషాలకు ఆదేశాలు జారీ చేసింది. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో జస్టిస్ ఎం.దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ వాదనలు విని ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో.. ఏక నాయకత్వంపై సర్వ సభ్య నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది.‘తన’ అనుకున్న నేతలంతా దూరమై, పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (OPS) తదుపరి నిర్ణయమేంటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90 శాతం ఈపీఎస్‌ (EPS) వైపు చేరడంతో ఆ బృందం చెప్పింది వినడం మినహా ఓపీఎస్‏కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. 2016లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (Jayalalitha) కన్నుమూసిన అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఓపీఎస్‏కు అనతికాలంలోనే పదవీగండం ఎదురైంది. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఓపీఎస్‌.. తనను పదవి నుంచి తప్పించిన శశికళపై (VK SasiKala) ‘ధర్మయుద్ధం’ పేరుతో తిరుగుబాటు చేశారు. అయినా ఆయన తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌).. ఆ తరువాత ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. అయితే ఆ పెద్దల సూచనతో ఓపీఎస్‏ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి సైతం కట్టబెట్టారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పార్టీ సమన్వయకర్తగా ఓపీఎస్‌, ఉపసమన్వయకర్తగా ఈపీఎస్‏కు పదవుల పందేరం జరిగింది.


ఆది నుంచి ఈపీఎస్‏దే పైచేయి..

ఈపీఎస్‌ ఉపసమన్వయకర్తగా వున్నా పార్టీలో ఆయనదే పైచేయిగా నిలిచింది. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో ఆయన మాటే చెల్లుబాటయింది. అప్పటి నుంచి పార్టీపై పూర్తిగా పట్టు సాధించిన ఈపీఎస్‌.. తరువాతి కాలంలో మరొకరితో పగ్గాలు పంచుకునేందుకు విముఖత కనబరుస్తూ వచ్చారు. పార్టీలో క్రియాశీలకమైన 60 మంది జిల్లా కార్యదర్శుల్లో ఎక్కువమంది తన వెంటే ఉండడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 66 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా ఈపీఎస్‌ వెంట వుండడం కూడా ఆయనకు ధైర్యాన్నిచ్చింది. దీనికి తోడు ఓపీఎస్‌ శశికళతో సన్నిహితంగా ఉండడం, ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో తనను సాగనంపేందుకు కుట్ర జరుగుతోందన్న నిర్ణయానికి వచ్చిన ఈపీఎస్‌.. ‘ఏకనాయకత్వం’ అంశాన్ని తెరపైకి తెచ్చారు.


సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది..

ఏకనాయకత్వంపై ఈపీఎస్‌ ముందుగానే ఓపీఎస్‌కు సర్ది చెప్పారని అన్నాడీఎంకే వర్గాల భోగట్టా. ప్రధాన కార్యదర్శిగా తాను పగ్గాలు చేపట్టదలచానని, అందుకు మద్దతు ఇస్తే పార్టీలో గౌరవప్రదమైన పదవితో పాటు మున్ముందు ఓపీఎస్‌ వర్గానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తానని కూడా ఈపీఎస్‌ సర్ది చెప్పినట్లు తెలిసింది. అయితే అందుకు ఓపీఎస్‌ ససేమిరా అనడంతో ఈపీఎస్‌ తన వ్యూహాన్ని అమలులో పెట్టారు. దీంతో పార్టీలో ఓపీఎస్‌ అధికారాల కత్తెరకు ముహూర్తం పడినట్లయింది. పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంపై ఇటీవల చెన్నై వచ్చిన ప్రధాని వద్ద కూడా ఈపీఎస్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకు ఢిల్లీ పెద్దలు తలూపడం వల్లనే ఆయన ఈ సాహసానికి దిగినట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఆది నుంచి శశికళను వ్యతిరేకించిన ఓపీఎస్‌.. ఇప్పుడామెను పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం కనబరచడం ఢిల్లీ పెద్దలకు కూడా నచ్చడం లేదని, అందుకే మొదట్లో ఓపీఎస్‌కు అండగా నిలిచిన ప్రధాని.. ఆ తరువాత ఆయన్ని దూరంగా పెట్టారని బీజేపీ వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి.

Read more