గువాహటి జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీ క్లీన్ స్వీప్

ABN , First Publish Date - 2022-04-24T23:31:24+05:30 IST

అసోంలోని గువాహతి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, దాని భాగస్వామ్య పక్షమైన ..

గువాహటి జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీ క్లీన్ స్వీప్

గువాహటి: అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, దాని భాగస్వామ్య పక్షమైన ఏజీపీ కూటమి ఆదివారంనాడు విజయభేరి మోగించింది. 60 వార్డుల్లో 58 వార్డులు కైవసం చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, అసోం జాతీయ పరిషత్ (ఏజేపీ) ఒక్కో స్థానం గెలుచుకుని ఖాతా తెరవగా, రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేక చతికిలపడింది.


బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. బీజేపీ 53 వార్డుల్లో పోటీకి నిలబడగా, కాంగ్రెస్ 55 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ 39 వార్డుల్లో పోటీచేసి ఒక వార్డు దక్కించుకోవడం ద్వారా గౌహతిలో అడుగుపెట్టింది. ఏజేపీ కూడా ఒక సీటు గెలుచుకుంది.


ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా: సీఎం

జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రాలకు చారిత్రక విజయం కట్టబెట్టిన ప్రజలకు తాను శిరసువంచి అభివాదం తెలియజేస్తున్నానని ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ ట్వీట్ చేశారు. జీఎంసీ ఎన్నికల్లో విజయంపై ప్రధాన మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. గత నెలలో రాష్ట్ర మున్సిపల్ బోర్డులకు జరిపిన ఎన్నికల్లోనూ బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు ఇదే తరహా విజయం సాధించారు. కాగా, జీఎంసీకి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించారు. 2013లో చివరిసారిగా ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, 2016లో బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2021లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-04-24T23:31:24+05:30 IST