నెహ్రూ టార్గెట్‌గా బీజేపీ వీడియో

ABN , First Publish Date - 2022-08-15T09:29:55+05:30 IST

దేశ విభజనపై.. భారత ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూను టార్గెట్‌గా చేసుకుని బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది.

నెహ్రూ టార్గెట్‌గా బీజేపీ వీడియో

  • రాడ్‌క్లిఫ్‌కు ఏం తెలుసని విభజన రేఖ గీశారు?
  • ఏడు నిమిషాల వీడియోలో నెహ్రూపై విమర్శలు

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ విభజనపై.. భారత ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూను టార్గెట్‌గా చేసుకుని బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది. అడ్డంగా విభజన చేస్తుంటే.. నెహ్రూ చూస్తూ కూర్చున్నారని పరోక్షంగా ఆ వీడియోలో ఆరోపించింది. విభజనకు ముస్లింలీగ్‌ నేత మహమ్మద్‌ అలీ జిన్నా చేసిన డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారని విమర్శించింది. ఆగస్టు 14ను ‘దేశ విభజన భయోత్పాత - సంస్మరణ దినం’గా జరుపుకోవాలని గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశ విభజన నేపథ్యంలో జరిగిన హిందువుల ఊచకోత, వారి త్యాగాలు, ఎందరెందరో ఇబ్బందులు పడిన తీరును భావితరాలు గుర్తెరగాలని ఆయన ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆదివారం కూడా ఆయన ఉదయం విభజన దినానికి సంబంధించి ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన 7 నిమిషాల నిడివిగల ఓ వీడియో సాంతం నెహ్రూను టార్గెట్‌గా చేసుకుంది. విభజన సందర్భంగా బ్రిటిష్‌ అధికారి సిరిల్‌ జాన్‌ ‘రాడ్‌క్లిఫ్‌’ గీసిన మ్యాప్‌(సరిహద్దు ఊహారేఖ)పైనా బీజేపీ వీడియో విమర్శలు చేసింది. తూర్పున బెంగాల్‌ను, పశ్చిమాన పంజాబ్‌ను అడ్డంగా ముక్కలు చేశారని దుయ్యబట్టింది.


‘‘అడ్డదిడ్డంగా విభజన చేస్తుంటే.. ఆ సమయంలో బాధ్యతగలిగిన వ్యక్తులు(ముఖ్యంగా నెహ్రూను ఉద్దేశించి) ఎక్కడికెళ్లారు?’’ అని ట్వీట్‌ చేసింది. కమ్యూనిస్టులు కూడా విభజనకు మద్దతిచ్చారని విమర్శించింది. ఈ వీడియోపై కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి(సమాచారం) జైరాంరమేశ్‌ తీవరంగా స్పందించారు. ‘‘దేశ విభజన ఓ బాధాకరమైన ఘట్టం. హింసను ప్రోత్సహించేందుకు ఆ ఘట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు. అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రధాని మోదీ ఆ బాధాకరమైన ఘట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దారుణం’’ అన్నారు. 


నెహ్రూ ఉపన్యాసాన్ని షేర్‌ చేసిన కాంగ్రెస్‌

1947.. ఆగస్టు 14.. సరిగ్గా అర్ధరాత్రి..! పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ మండలి భేటీ అయ్యింది. భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ పేరుతో ప్రత్యేక ఉపన్యాసమిచ్చారు. నెహ్రూ స్వయంగా తన చేతిరాతతో రాసిన ఆ ఉపన్యాస ప్రతిని జైరాం రమేశ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. దాంతోపాటు.. నెహ్రూ ఉపన్యాసానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.


వెబ్‌సైట్‌లో తిరంగా ఫొటోలు పెట్టండి: మోదీ

హర్‌ఘర్‌ తిరంగాకు విశేషమైన స్పందన వస్తోందని, దానికి తాను గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా పౌరులంతా రికార్డు స్థాయిలో జెండాలు ఎగురవేస్తున్నారన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో ఇదో మైలురాయి అంటూ ట్వీట్‌ చేశారు. పౌరులు హర్‌ఘర్‌తిరంగా డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో తమ ఇంటిపై ఎగురుతున్న జెండా ఫొటోలను షేర్‌ చేయాలని కోరారు.

Read more