త్వరలో డీఎంకే ప్రభుత్వంపై రెండో అవినీతి చిట్టా

ABN , First Publish Date - 2022-06-11T16:09:21+05:30 IST

డీఎంకే ప్రభుత్వ అవినీతి అక్రమాలపై మరిన్ని బలమైన ఆధారాలతో రెండో విడత ఆరోపణల పత్రాన్ని విడుదల చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ

త్వరలో డీఎంకే ప్రభుత్వంపై రెండో అవినీతి చిట్టా

                              - బీజేపీ నేత అన్నామలై


చెన్నై, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వ అవినీతి అక్రమాలపై మరిన్ని బలమైన ఆధారాలతో రెండో విడత ఆరోపణల పత్రాన్ని విడుదల చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు. సేలం జిల్లా ఏర్కాడు నాగలూరు గ్రామంలో ఎస్టీనగర్‌ గిరిజనులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తాను ఆరోపణలు చేస్తే కేసు పెడతామంటూ డీఎంకే పాలకులు బెదరిస్తుండటం గర్హనీయమని పేర్కొన్నారు. తొలివిడత అవినీతి గుట్టును రట్టు చేసినప్పుడే మంత్రులంతా పనిగట్టుకుని విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ వివరణలు, సంజాయిషీలు ఇచ్చారని ఆయన చెప్పారు. త్వరలో రెండో విడత అవినీతి గుట్టును రట్టు చేస్తామని, ఈసారి పటిష్ఠమైన ఆధారాలతో తాను చేయనున్న ఆరోపణలకు పాలకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందని అన్నారు. మొదటి విడత అవినీతి చిట్టా కంటే రెండో విడత అవినీతి చిట్టాలో పదింతల తీవ్రతను కలిగి ఉంటుందని అన్నామలై చెప్పారు. ఇటీవలి కాలంలో డీఎంకే ప్రభుత్వం ఆధీనాల (మఠాల) వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందన్నారు. మదురై ఆధీనం పల్లకీ సేవను తీవ్రంగా విమర్శించి, ఆ సేవను అనుమతించబోమని తొలుత ప్రకటించి, ఆ తర్వాత అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ సేవను అనుమతించి అభాసుపాలైందని విమర్శించారు. 

Read more