Bihar Terror module: నిందితుడికి ఖతార్ నుంచి క్రిప్టో కరెన్సీ

ABN , First Publish Date - 2022-07-24T22:15:36+05:30 IST

బీహార్‌లో సంచలనం సృష్టించిన ఫుల్వరి షరీఫ్ టెర్రర్ మాడ్యూల్ కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణలో కీలక విషయాలు ..

Bihar Terror module: నిందితుడికి ఖతార్ నుంచి క్రిప్టో కరెన్సీ

పాట్నా: బీహార్‌లో సంచలనం సృష్టించిన ఫుల్వరి షరీఫ్ టెర్రర్ మాడ్యూల్ కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందుతుడైన మార్గువ్ అహ్మద్ డేనిష్ (26) ఖతార్ నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులు అందుకునే వాడని విచారణలో తేలినట్టు పోలీసులు ఆదివారంనాడు తెలిపారు.


ఫుల్వరి షరీప్ నివాసి అయిన డేనిష్‌ను జూలై 15న అరెస్టు చేశారు. ఇండియా వ్యతిరేక అభిప్రాయాలను ప్రచారం చేసేందుకు 'ఘజ్వా-ఇ-హింద్', 'డైరెక్ట్ జీహాద్' అనే రెండు వాట్సాప్ గ్రూపులను డేనిష్ నడుపుతున్నాడనే కారణంగా అతన్ని అరెస్టు చేశారు. ఖతార్‌కు చెందిన అల్‌ఫల్హి అనే సంస్థ నుంచి అతను క్రిప్రో కరెన్సీ రూపంలో నిధులు అందుకునే వాడని విచారణలో తెలిసినట్టు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన మతోన్మాద సంస్థ తెహ్రిక్-ఇక-లబ్బైఖ్‌తో కూడా డేనిష్‌కు సంబంధాలున్నాయని, పాకిస్థాన్ జాతీయుడైన ఫైజాన్‌తో తరచు డేనిష్ సంప్రదింపులు జరిపేవాడని విచారణలో వెల్లడైనట్టు ఆ అధికారి తెలిపారు. భారత జాతీయ పతాకాన్ని, గుర్తును అగౌరవపరిచే సందేశాలను ఘజ్వా-ఇ-హింద్‌ గ్రూప్‌లో షేర్ చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారని చెప్పారు.  గ్రూపు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న డేనిష్ కొన్ని విదేశీ గ్రూపులతో కూడా సంప్రదింపులు సాగిస్తూ  వచ్చినట్టు తేలిందని వివరించారు. కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ బృందం గత బుధవారంనాడు ఈస్ట్ చంపరాన్ జిల్లాలోని జామియా మరియా నిశ్వా మదరసాలో సోదాలు జరిపి అష్ఘర్ అలీ అనే టీచర్‌ను అరెస్టు చేసింది.


పీఎఫ్ఐ‌పై ఎన్‌ఐఏ డేగకన్ను..

ఫుల్వామా షరీప్, ఉదయ్‌పూర్, అమ్రావతి హత్యుల్లో పీఎఫ్ఐ-ఎస్‌డీపీఐ సంబంధాలపై ఎన్ఐఏ అప్రమత్తమైంది. పీఎఫ్ఐ (పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)కు పశ్చిమ ఆసియా నుంచి నిధులు అందుతుండటం, దేశంలోని 24 రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా క్యాడర్ ఉండటం ఎన్ఐఏ గుర్తించింది.


ప్రధాని నరేంద్ర మోదీ 2022 జూలై 11న బిహార్ పర్యటనకు ఒక రోజు ముందు అథర్ పర్వేజ్, మొహమ్మద్ జలాలుద్దీన్ అనే ఇద్దరి ఇస్లామిస్టుల సంభాషణలను అడ్డుకున్న ఎన్ఐఏ తక్షణ దాడులు జరిపింది. ఈ రెయిడ్స్‌లో భారత వ్యతిరేక సామగ్రిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దీంతో జూలై 22న ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ హోం శాఖ ఆదేశాలిచ్చింది. ఎన్ఐఏ 26 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఎక్కువ మంది పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్న వారే. ఈ అనుమానాస్పద తీవ్రవాదులంతా ప్రధాని మోదీ పర్యటనకు ముందు 15 రోజుల పాటు ఫుల్వామా షరీఫ్‌లో శిక్షణ పొందారు. ప్రధానిని లక్ష్యంగా చేసుకుని జూలై 6,7 తేదీల్లో సమావేశమయ్యారు.


కాగా, ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎన్ఐఏ జూలై 10న జరిపిన దాడుల్లో కీలక సమచారం లభ్యమైంది. ''2047 ఇండియా టువార్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా'' అనే టైటిల్‌లో ఉన్న డాక్యుమెంట్‌తో పాటు 25 పీఫ్ఐ కరపత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఉదయ్‌పూర్, అమ్రావతి హత్యలపై కూడా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, ఈ కేసుల్లో అరెస్టు చేసిన ఇస్లామిస్టులకు పీఎఫ్ఐ ఫ్రంట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)తో సంబంధాలున్నట్టు గుర్తించింది. ఇంతటి క్రూర హత్యలకు పాల్పడిన తర్వాత కూడా నిందితులు ఇంటరాగేషన్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడక పోవడం ఆసక్తికరం.

Read more