Agnipath Protest: అగ్నిపథ్ నిరసనల్లో మావోయిస్టుల పాత్ర : బిహార్ పోలీసులు

ABN , First Publish Date - 2022-08-06T19:40:42+05:30 IST

రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్

Agnipath Protest: అగ్నిపథ్ నిరసనల్లో మావోయిస్టుల పాత్ర : బిహార్ పోలీసులు

పాట్నా : రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ (Agnipath) పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మావోయిస్టుల పాత్ర ఉందని బిహార్ పోలీసులు (Bihar Police) శుక్రవారం తెలిపారు. ఓ మావోయిస్టు నేతను శుక్రవారం అరెస్టు చేయడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. 


అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జూన్‌లో జరిగిన నిరసనల్లో భాగంగా లఖిసరాయ్‌లో ఓ రైలును దహనం చేశారు. ఈ దహనకాండలో తనతోపాటు తమ సానుభూతిపరుల పాత్ర ఉందని ఆ మావోయిస్టు నేత చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 


సీనియర్ పోలీసు అధికారి పంకజ్ కుమార్ మాట్లాడుతూ, మావోయిస్టు నేత మనశ్యామ్ దాస్‌ను లఖిసరాయ్ పట్టణంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. తెలంగాణా పోలీసులు అందజేసిన సమాచారం మేరకు ఆయనను అరెస్టు చేశామన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం దాస్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారని, మావోయిస్టు సంబంధిత కార్యకలాపాలను ఈ ఇంటి నుంచే నిర్వహిస్తున్నారని తెలిపారు. రైల్వే ఆస్తుల విధ్వంసం, దహనకాండకు కొందరిని దాస్ ప్రోత్సహించినట్లు చెప్పారు. 


మనశ్యామ్ దాస్ అనేక సంవత్సరాల నుంచి లఖిసరాయ్‌లో ఉంటూ మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు చెప్పారు. బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణా రాష్ట్రాల్లోని మావోయిస్టు అగ్ర నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. నక్సలైట్ సంస్థల అగ్ర నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్నారు. మొబైల్, మావోయిస్టు సాహిత్యం వంటివాటిని ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. 


మావోయిస్టు నేతలను కలిసేందుకు దాస్ అడవుల్లోకి వెళ్ళేవారని, నగరంలో కొందరు నాయకులతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయని వెల్లడైందన్నారు. భాగల్పూరులోని ఓ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌కు కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని దాస్ చెప్పారని, అయితే ఆ ప్రొఫెసర్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారని తెలిపారు. 


అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోట్లాది రూపాయల విలువ చేసే రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. దాదాపు 2,000 రైళ్ళ రాకపోకలపై ఈ నిరసనల ప్రభావం పడింది. 


Read more