2024 Lok Sabha Polls: బీహార్ సీఎం నితీశ్ వ్యూహమిదే!

ABN , First Publish Date - 2022-12-13T16:28:12+05:30 IST

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) తన మనసులోని మాటను బయటపెట్టారు.

2024 Lok Sabha Polls: బీహార్ సీఎం నితీశ్ వ్యూహమిదే!
Nitish Tejaswi

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) తన మనసులోని మాటను బయటపెట్టారు. పాట్నాలో జేడియూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు ప్రధానమంత్రి కావాలని లేదన్నారు. ముఖ్యమంత్రిగా కూడా ఉండాలని లేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Polls) బీజేపీ(BJP)ని ఓడించడమనే లక్ష్యం మాత్రమే ఉందన్నారు.

అలాగే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్జేడీ అధినేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Bihar Deputy CM Tejaswi Yadav ) నేతృత్వం వహిస్తారని నితీశ్ స్పష్టం చేశారు. 2015 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిలో తాను ఉండబోనని తేల్చి చెప్పారు. నితీశ్ ప్రకటనతో ఆర్జేడీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి నితీశే కూడా కావొచ్చని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

బీహార్‌లో కొంత కాలం క్రితం వరకూ బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న నితీశ్ ఆ తర్వాత వారితో కటిఫ్ చెప్పి ఆర్జేడీ-కాంగ్రెస్‌తో చేతులు కలిపి మహాఘట్‌బంధన్‌ పేరిట కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నితీశ్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఎన్డీయేతర పార్టీలతో అలాగే యూపిఏలోని పార్టీల నేతలతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తన ప్రస్తుత లక్ష్యమన్న నితీశ్ విపక్ష నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.

విపక్షాల కూటమిలో కాంగ్రెస్ తప్పకుండా ఉండాలనేది నితీశ్ నిబంధన పెడ్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో చేతులు కలపాలా వద్దా అనేది ఆయన నిర్ణయించుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు. కర్ణాటకలో జేడిఎస్ అధినేత కుమారస్వామి కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తటస్థంగా ఉంటున్నారు. మమత కూడా విపక్షాల కూటమిలో కాంగ్రెస్ ఉండటాన్ని పూర్తిస్థాయిలో సమర్థించడంలేదు. ఈ తరుణంలో ఈ అగ్రనేతలందరినీ ఒకే తాటిపై తీసుకురావాలని నితీశ్‌ తలపోస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తేనే విపక్షాల రాజకీయ నేతలు ఏకతాటిపైకి రావడం, రాకపోవడం అనే విషయంలో స్పష్టత వస్తుంది.

Updated Date - 2022-12-13T18:45:33+05:30 IST