Bengaluruలో మాస్క్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-06-07T16:28:13+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నాలుగైదు రోజులుగా తీవ్రమవుతుండడంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి నివేదిక కోరతామని, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని

Bengaluruలో మాస్క్‌ తప్పనిసరి

- కొవిడ్‌ తీవ్రతపై నివేదిక కోరతా

- ఆందోళన అవసరం లేదు 

- ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై


బెంగళూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నాలుగైదు రోజులుగా తీవ్రమవుతుండడంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి నివేదిక కోరతామని, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. వారం రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంపై బెంగళూరు బీబీఎంపీ అధికారులతోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి సమగ్ర సమాచారం సేకరించాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించామన్నారు. బెంగళూరులో సోమవారం ఆయన విధానసౌధ వద్ద మీడియాతో మా ట్లాడారు. మరో రెండు మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గడిచిన కొన్ని నెలలుగా కేసులు తగ్గాయని కాగా వారంలో కొంతమేర పెరిగాయని వివరించారు. 


బెంగళూరులో మాస్క్‌ తప్పనిసరి 

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులకంటే బెంగళూరు కేంద్రంగానే రోజూ వందల్లో నమోదవుతుండడంతో నిబంధనలు అమల్లోకి తెచ్చారు. బెంగళూరు వ్యాప్తంగా మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ బీబీఎంపీ తీర్మానించింది. ఈమేరకు స్పెషల్‌ కమిషనర్‌ హరీశ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ నగర వ్యాప్తంగా మాస్క్‌ ధరించాల్సిందేనని ఆదేశించామన్నారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌, షాపింగ్‌మాల్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలన్నింటి చోటా మాస్క్‌ను తప్పనిసరి చేశామన్నారు. పర్యవేక్షణకు మార్షల్స్‌ను నియమించామని సోమవారం నుంచే నిబంధనలు అమలులోకి తెచ్చామన్నారు. నాల్గవ విడత కొవిడ్‌  ప్రబలే అవకాశాలు ఉన్నాయనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్క్‌ లేకున్నా జరిమానా వ సూలు చేయలేదన్నారు. ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిన మేరకు మాస్క్‌ నిబంధన తప్పనిసరి చేశామని వివరించారు. ప్రస్తుతానికి రోజూ నగర వ్యాప్తంగా 16వేల కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నామని, త్వరలోనే 20వేలకు పెంచుతామన్నారు. బెంగళూరులో 16 రోజుల తర్వాత 72 ఏళ్ల మహిళ కొవిడ్‌తో మృతి చెందారన్నారు. ఈమె కొన్ని రోజులుగా జలుబు, జ్వరంతోపాటు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారన్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందారన్నారు. నగర పరిధిలో 200-300 దాకా రోజూ కేసులు నమోదవుతున్నా 15 రోజులుగా ఒక్కరు కూడా మృతి చెందలేదని వివరించారు.  



Updated Date - 2022-06-07T16:28:13+05:30 IST