Bengaluru: అభ్యర్థుల ఎంపికకు భారీ కసరత్తు

ABN , First Publish Date - 2022-12-06T12:15:33+05:30 IST

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేడి రోజురోజుకు పుంజుకుంటోంది. ఏప్రిల్‌(April)లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున

Bengaluru: అభ్యర్థుల ఎంపికకు భారీ కసరత్తు

- నెలాఖరులోగా 150 మందితో కాంగ్రెస్‌ జాబితా

- గుజరాత్‌ ఫలితాల తర్వాత బీజేపీ పెద్దల రాక

- 90 మందితో జేడీఎస్‌ తొలి జాబితా సిద్ధం

- రాష్ట్ర పర్యటనలకు నేతల సన్నాహాలు

బెంగళూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేడి రోజురోజుకు పుంజుకుంటోంది. ఏప్రిల్‌(April)లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకునేందుకు మూడు రాజకీయ పార్టీలు భారీ కసరత్తుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ(Congress and BJP) ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఎక్కువమందికి మరోసారి టికెట్లు దక్కుతాయనే సందేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ డిసెంబరు ఆఖరుకు 150 మంది అభ్యర్థుల జాబితాకు తుదిరూపు ఇవ్వాలని తీర్మానించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీ్‌పసింగ్‌ సుర్జేవాలా రాష్ట్రంలోనే దాదాపు మకాం వేశారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ అభ్యర్థుల వివరాలను ఎక్కడికక్కడ బేరీజు వేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పట్టు ఉండడంతో గెలుపు సాధ్యమయ్యేవారికే టికెట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఇక జేడీఎస్‌(JDS) పార్టీ 90 మంది అభ్యర్థుల జాబితా ఇప్పటికే సిద్ధం చేసుకుంది. రెండు వారాల క్రితమే జాబితా ప్రకటిస్తామని బహిరంగంగా ఆ పార్టీ ముఖ్యనేత కుమారస్వామి వెల్లడించారు. అయితే ముహూర్తంతో పాటు మరికొన్ని అభ్యంతరాలను రేవణ్ణ వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలోనే కుమారస్వామి జన్మదినం ఉన్నందున అదే రోజు జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధికార బీజేపీ అగ్రనేతలు గుజరాత్‌ ఎన్నికల బిజీలో ఉండడంతో వారు అభ్యర్థుల విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

గుజరాత్‌లో ఫలితాల తర్వాత అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. తొలి విడతలో అగ్రనేతలందరూ బెంగళూరులో కీలక సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రక్రియను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌లకు ఎవరికివారుగా ఉండరాదని కలసి చర్చించుకోవాలని అధిష్ఠానం సూచించినట్టు తెలుస్తోంది. ఈలోగానే ప్రతి నియోజకవర్గానికి కనీసం ముగ్గురి పేర్లతో జాబితా తయారు చేయాలని రాష్ట్ర కమిటీకి సూచించినట్టు సమాచారం. ప్రముఖులు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గమే అయినా ఒకే పేరుతో సిఫారసు చేయరాదని, మూడు పేర్లు ఉండాల్సిందేనని సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర కోర్‌ కమిటీ సభలో చర్చించాక కేంద్ర పార్టీ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. సిట్టింగ్‌లలో పలువురిని తప్పిస్తారనే అంశం కూడా చర్చలకు కారణమవుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ రెండో విడత సమావేశాలకు సిద్ధమవుతోంది. జనవరిలో అగ్రనేతల సభ, ఫిబ్రవరిలో బీసీల సదస్సు, మైనార్టీలు సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌ ఈనెల 13న ముందస్తు సభకు ఆహ్వానించారు. విజయపుర లేదా బాగల్కోటెలో సభ నిర్వహిస్తారు. పూర్తి బాధ్యతలను ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌కు అప్పగించారు. సిద్దరామయ్య, శివకుమార్‌ జనవరిలో రథయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా జిల్లాల పర్యటనలు చేస్తారు. 224 నియోజకవర్గాల్లోనూ ఇద్దరు నేతలు పర్యటించేలా షెడ్యూల్‌కు రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. 224 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఆశిస్తూ 1300 మంది దరఖాస్తు చేసుకోగా వాటిని నియోజకవర్గాల వారీగా విభజించి జిల్లాస్థాయిలోనూ పరిశీలన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ, పరిశీలనా సమితులు వీటిని ఓ కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికలు సాగుతున్నా పదులసంఖ్యలో ప్రాంతీయ పార్టీలు పోటీలకు సిద్ధమవుతున్నాయి. టికెట్లు దక్కనివారు స్వతంత్రంగానే రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఉత్సాహంగా రాజకీయం చేస్తోంది. అయితే వారిపోటీపై ఇంకా స్పష్టత లేదు.

Updated Date - 2022-12-06T12:15:35+05:30 IST