చెన్నై తెలంగాణా సంఘంలో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-26T17:42:50+05:30 IST

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన బతుకమ్మ పండుగను రాజధాని నగరంలో స్థిరపడిన తెలంగాణా వాసులు జార్జిటౌన్‌లోని కన్యకా..

చెన్నై తెలంగాణా సంఘంలో బతుకమ్మ సంబురాలు

పూల పండుగకు పోటెత్తిన ప్రజలు

చెన్నై/ప్యారీస్‌: తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన బతుకమ్మ పండుగను రాజధాని నగరంలో స్థిరపడిన తెలంగాణా వాసులు జార్జిటౌన్‌లోని కన్యకా పరమేశ్వరి కళాశాల ప్రాంగణంలో ఆదివారం సంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, విశిష్ట అతిథులుగా తెలంగాణా రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య  చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, నల్గొండ డీసీసీబీ డైరెక్టర్‌ పి.ప్రవీణ్‌రెడ్డి, మోతుకూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి మేగారెడ్డి, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్‌ మేగాళ్‌రెడ్డి, తమిళనాడు తెలుగు పీపుల్స్‌ సొసైటీ వ్యవస్థాపకుడు దేవరకొండ రాజు తదితరు లు పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలు గుర్తుచేస్తూ తెలంగాణా సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెప్పారు. మహాలయ అమావాస్య పర్వదినాన తొమ్మిది తీరుల బతుకమ్మ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మగా ఆరాధించి అటుకులు, బెల్లం, సకినాల పిండి, నువ్వులు తదితర ఫలహారాలను నైవేధ్యంగా సమర్పించారు.


బతుకమ్మ పండుగను పూల ఉత్సవంగా, ప్రకృతిని పూజించే పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చెన్నై తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలిరోజు వేడుకల్లో నగరం, శివారు ప్రాంతాల్లో నివసించే తెలంగాణా ప్రాంత మహిళలు తమ కుటుంబసభ్యులతో కలసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ఏర్పాటుచేసి భక్తిశ్రద్ధలతో కొలిచారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలతో మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో ఆడుతూ, పాడుతూ నృత్యాలతో అలరించారు. అక్టోబరు 3న సద్దుల బతుకమ్మ పూజతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. వేలసంఖ్యలో తరలివచ్చిన తెలంగాణా వాసులతో వేదిక ప్రాంగణం కిటకిటలాడింది. చెన్నై తెలంగాణా సంఘం నిర్వాహకులు, కార్యవర్గ కమిటీ సభ్యులు, అన్ని కుల సంఘాల సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు తెలుగులోనే ప్రసంగించడం విశేషం. బతుకమ్మ జాతరకు అన్నివిధాలా సహకరిస్తామని, ఇందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఉందని శేఖర్‌ బాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Read more