పీఎఫ్‌ఐపై నిషేధం

ABN , First Publish Date - 2022-09-29T08:51:56+05:30 IST

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ)పై కేంద్రం కొరడా ఝళిపించింది.

పీఎఫ్‌ఐపై నిషేధం

ఉపా చట్టం కింద చర్యలు


ఎనిమిది అనుబంధ సంస్థలపై కూడా..

ఐదేళ్లపాటు నిషేధం అమలు

అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతోనూ లింకులు

నిషేధించాలన్న గుజరాత్‌, కర్ణాటక, యూపీ  

నోటిఫికేషన్‌ జారిచేసిన కేంద్ర హోంశాఖ 

సంస్థ రద్దయినట్టు ప్రకటించుకున్న పీఎఫ్‌ఐ

కేరళలో అదుపులోకి ప్రధాన కార్యదర్శి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ)పై కేంద్రం కొరడా ఝళిపించింది. పీఎ్‌ఫఐతోపాటు ఎనిమిది అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిషేధ చట్టం (ఉపా) కింద ఈ చర్యలు చేపట్టింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని మంగళవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.  ఐఎస్‌ సహా పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పీఎ్‌ఫఐకి సంబంధాలున్నాయని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మంగళవారం ఏడు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 150 మంది పీఎ్‌ఫఐ నాయకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా పెద్ద సంఖ్యలో పీఎ్‌ఫఐ నేతల అరెస్టులు జరిగాయి. ఆ సంస్థ ఆస్తులను కూడా జప్తు చేశారు. ‘‘ఒకప్పటి సిమీ(స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా) సంస్థ నేతలే పీఎఫ్‌ఐ వ్యవస్థాపక సభ్యులు. పీఎ్‌ఫఐకి జేఎంబీ(జమాత్‌-ఉల్‌-ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌)తో లింకులున్నాయి.


జేఎంబీ, సిమీ రెండూ నిషేధిత సంస్థలే. దేశంలో అభద్రతాభావం నెలకొందనే అభిప్రాయాన్ని ఓ మతస్థుల్లోకి కలిగించి... తీవ్రవాదాన్ని ప్రేరేపించడమే లక్ష్యంగా పీఎ్‌ఫఐ, దాని అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి’’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది. పీఎ్‌ఫఐ కేడర్‌లో కొందరు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో చేరడమే దీనికి నిదర్శనమని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌ ప్రభుత్వాలు కూడా పీఎ్‌ఫఐపై నిషేధానికి సిఫారసు చేశాయని పేర్కొంది. దేశంలో భయోత్పాతం సృష్టించే ఉద్దేశంతో పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపింది. ఈ సంస్థలు బహిరంగంగా సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ సంస్థలను నిర్వహిస్తున్నా సమాజంలోని ఓ వర్గాన్ని హింసామార్గంలోకి తీసుకెళ్లడం వాటి రహస్య అజెండా అని పేర్కొంది. పీఎ్‌ఫఐ కేడర్‌ హింసాత్మక, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వివిధ కేసుల దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. 


నిషేధం ఈ సంస్థలపైనే..

పీఎ్‌ఫఐతోపాటు దాని అనుబంధ సంస్థలు రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌(ఆర్‌ఐఎఫ్‌), క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(సీఎ్‌ఫఐ), ఆలిండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌(ఏఐఐసీ), నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌సీహెచ్‌ఆర్‌వో), నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌  ఇండియా ఫెడరేషన్‌, రిహాబ్‌ ఫెడరేషన్‌-కేరళపై నిషేధం విధించినట్టు  హోంశాఖ ప్రకటించింది. పీఎ్‌ఫఐ సభ్యుల ద్వారానే ఆర్‌ఐఎఫ్‌ నిధులు సమీకరిస్తోందని, కొందరు పీఎ్‌ఫఐ సభ్యులు సీఎ్‌ఫఐ, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహాబ్‌ ఫౌండేషన్‌-కేరళ సంస్థల్లోనూ సభ్యులుగా ఉన్నారని తెలిపింది. జూనియర్‌ ఫ్రంట్‌, ఏఐఐసీ, ఎన్‌సీహెచ్‌ఆర్‌వో, నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌ కార్యకలాపాల పర్యవేక్షణ పీఎ్‌ఫఐ నేతలే చేస్తున్నారని వివరించింది. 


చర్యలు తీసుకునే అధికారం రాష్ర్టాలకు

పీఎ్‌ఫఐ, దాని అనుబంధ సంస్థలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ సంస్థల సభ్యులను అరెస్టు చేయడంతోపాటు ఆస్తులు సీజ్‌ చేసేందుకు అధికారం కల్పించింది. కాగా, ప్రకటించిన లక్ష్యాల దిశగా పీఎ్‌ఫఐ కార్యకలాపాలు సాగని కారణంగా ఆదాయపు పన్ను శాఖ చట్టం-1961లోని సెక్షన్‌ 12ఏ, 12ఏఏ ప్రకారం పీఎ్‌ఫఐకి మంజూరు చేసిన రిజిస్ర్టేషన్‌ను ఆదాయపు పన్నుశాఖ రద్దు చేసిందని హోంశాఖ పేర్కొంది. రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌ రిజిస్ర్టేషన్‌నూ ఐటీ శాఖ రద్దు చేసిందని తెలిపింది.  


పీఎ్‌ఫఐ రద్దు.. పట్టుబడ్డ ప్రధానకార్యదర్శి 

తమ సంస్థను రద్దు చేసుకుంటున్నామని పీఎ్‌ఫఐ బుధవారం ప్రకటించింది. దేశ చట్టాలకు కట్టుబడి  ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం అంటూ 

పీఎ్‌ఫఐ కేరళ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్‌ బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆయనను కేరళలో అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 23న నుంచి ఆయన పరారీలో ఉన్నారు.  


 ఆవిర్భావం ఇలా..

సిమీపై నిషేధం తర్వాత.. కర్ణాటకలోని ఫోరం ఫర్‌ డిగ్నిటీ, కేరళలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎన్‌డీఎఫ్‌), తమిళనాడులోని మనితా నీతి పసరాయ్‌ సంస్థలు కలిసి 2006లో పీఎ్‌ఫఐగా ఆవిర్భవించాయి. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటమే తమ లక్ష్యమని ప్రకటించాయి. కానీ.. ఇది నిషేధిత సిమీకి మరో రూపమని 2012లో అప్పటి కేరళ సీఎం ఊమెన్‌ చాందీ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కారు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్నికల్లో నేరుగా పాల్గొనదు కానీ 2009లో తమ సంస్థకు అనుబంధంగా సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అనే రాజకీయ పార్టీని పీఎ్‌ఫఐ ఏర్పాటు చేసింది.  


మౌనమే మేలు: బాధితుడు

పీఎ్‌ఫఐ నిషేధంపై స్పందించేందుకు కేరళలోని కోచ్చికి చెందిన ప్రొఫెసర్‌ టీజే జోసెఫ్‌ నిరాకరించారు. దేవ ధూషణ ఆరోపణపై 12 ఏళ్ల క్రితం ఆయన కుడి చేతిని పీఎ్‌ఫఐ కార్యకర్తలు నరికేశారు. నిషేధంపై స్పందించాలని మీడియా ఆయనను కోరగా, ‘కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటమే మేలు’ అన్నారు.  


పీఎ్‌ఫఐపై నిషేధం సబబే 

పీఎ్‌ఫఐపై నిషేధాన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. కేంద్ర నిర్ణయాన్ని బీజేపీ ప్రశంసించింది. ముస్లిం స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎంఎ్‌సవో), అజ్మీర్‌కు చెందిన ఆలిండియా సూఫీ సజ్జదనాషిన్‌ కౌన్సిల్‌ (ఏఐఎ్‌సఎ్‌ససీ) కేంద్ర నిర్ణయాన్ని సమర్థించాయి. పీఎ్‌ఫఐపై నిషేధం విధించడాన్ని కేరళ కాంగ్రెస్‌, దాని సంకీర్ణ భాగస్వామి ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) స్వాగతించాయి.  ఆర్‌ఎ్‌సఎస్‌పైనా ఇలాంటి చర్య తీసుకోవాలని కోరాయి. ఉగ్రవాద నిరోధక చట్టం కింద పీఎఫ్‌ఐపై నిషేధం విధించడాన్ని సమర్థించమని సీపీఎం తెలిపింది. పీఎ్‌ఫఐపై నిషేఽధం మోదీ సర్కారు చేసిన  మరో సర్జికల్‌ స్ట్రైక్‌ అని ఆలిండియా బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది.  


ఇలాంటి చర్యలు అర్థరహితం: అసదుద్దీన్‌

కొంత మంది వ్యక్తుల చర్యలను సాకుగా చూపి పీఎఫ్‌ఐని నిషేధం విధించడం అర్థరహితమని, ఈ నిర్ణయాన్ని సమర్థించనని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు.  

Updated Date - 2022-09-29T08:51:56+05:30 IST