15వేలమంది ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవుతున్నారు

ABN , First Publish Date - 2022-11-24T02:22:37+05:30 IST

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేసిన సుమారు 15వేలమంది వైద్య విద్యార్థులు, ఆన్‌లైన్‌లో తమ చదువును

15వేలమంది ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవుతున్నారు

640మంది ఉక్రెయిన్‌లోనే చదువుకుంటున్నారు

170మంది ఉక్రెయిన్‌ అనుబంధ విదేశీ సంస్థల్లో..

ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న.. భారత విద్యార్థులపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌

న్యూఢిల్లీ, నవంబరు 23: ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేసిన సుమారు 15వేలమంది వైద్య విద్యార్థులు, ఆన్‌లైన్‌లో తమ చదువును కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఉక్రెయిన్‌లో తాము చదువుకోవాల్సి ఉన్నా.. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తమను భారత వైద్యవిద్య సంస్థల్లో చదువుకునేందుకు అనుమతించాలని కోరుతూ పలువురు విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. వారికి అలా భారత్‌లో సీట్లు ఇస్తే.. ఇక్కడ ఆ సీట్లు దక్కాల్సిన విద్యార్థులు నష్టపోతారని కేంద్రం ఈ ఏడాది సెప్టెంబరు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ధర్మాసనం ఆదేశాల మేరకు ఒక అఫిడవిట్‌ను కేంద్రం బుధవారం న్యాయస్థానానికి సమర్పించింది. ‘‘మొత్తం 15,783మంది విద్యార్థులకు గాను, 640మంది ఇంకా ఉక్రెయిన్‌లోనే చదువుకుంటున్నారు. 170మంది ఇతర దేశాల్లో ఉన్న ఉక్రెయిన్‌ అనుబంధ కళాశాలల్లో విద్యను కొనసాగిస్తున్నారు. వీరి చదువు పూర్తైన అనంతరం ఉక్రెయిన్‌ డిగ్రీని పొందుతారు. 14,973మంది భారత్‌లోనే ఉంటూ ఉక్రెయిన్‌ వర్సిటీలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్నారు’’ అని కేంద్రం పేర్కొంది. ఈ అఫిడవిట్‌ చాలామంది పిటిషనర్లకు అందకపోవడంతో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 29కి వాయిదా వేసింది. మరోవైపు.. చైనా, ఫిలిప్పీన్స్‌ నుంచి కరోనా సమయంలో వెనక్కి వచ్చేసిన విద్యార్థులు సైతం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉక్రెయిన్‌ విద్యార్థులకు కల్పించినట్లే తమకు కూడా ఊరట కల్పించాలని వారు కోరారు. వారి పిటిషన్లపై సూచనలను తీసుకోవాలని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) కౌన్సెల్‌ గౌరవ్‌ శర్మను సుప్రీం కోర్టు ఆదేశించింది

Updated Date - 2022-11-24T02:22:46+05:30 IST