హోలీ రోజు ఇస్కాన్ ఆలయంపై బంగ్లాదేశ్‌లో దాడి

ABN , First Publish Date - 2022-03-20T02:18:30+05:30 IST

హోలీ పర్వదిన వేళ ముష్కర మూకలు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ రాజధాని..

హోలీ రోజు ఇస్కాన్ ఆలయంపై బంగ్లాదేశ్‌లో దాడి

ఢాకా: హోలీ పర్వదిన వేళ ముష్కర మూకలు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. మైనారిటీ హిందూ భక్తులపై ర్యాజికల్ ముస్లింలు ఈ దాడి జరిపినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ దాడిలో ముగ్గురు భక్తులు గాయపడినట్టు చెబుతున్నారు. ఇస్కాన్‌ రాధాకాంత ఆలయంలో 17వ తేదీన దాడి జరగగా, 48 గంటల తర్వాత కూడా ఢాకా పోలీసులు ఏ ఒక్కరినీ  అరెస్టు చేయలేదనీ ప్రత్యక్ష సాక్షి రస్మణి కేశవదాసు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తక్షణం ఈ దాడిపై చర్య తీసుకోవాలని, తరచు దాడులకు టార్గెట్‌గా మారుతున్న ఢాకాలోని మైనారిటీ హిందువులు, ఇస్కాన్ ఆలయాలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఏళ్ల తరబడి బెదరింపులు...

ఇస్కాన్ ఆలయంపై దాడిలో హాజీ షైఫుల్లా అనే వ్యక్తి పాత్ర ఉందని కేశవదాసు తెలిపారు. ఆలయాన్ని వదిలిపోవాల్సిందిగా షైఫుల్లా ఏళ్ల తరబడి ఆలయ అధికారులను బెదరిస్తున్నట్టు చెప్పారు. దాడి జరిగినప్పుడు 200 మందికి వ్యక్తులు మూకుమ్మడిగా ఇస్కాన్ ఆలయంలోకి చొరబడి విధ్వసం సృష్టించినట్టు తెలిపారు. ''వాళ్లు మా మాటలు వినిపించుకోలేదు. ఆలయం విడిచి పెట్టమని హుకుం జారీ చేశారు. ఈ ఆలయం మా ఆస్తి. అయినా వాళ్ల మా మాట వినకుండా దాడులకు దిగారు. ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు గాయపడ్డారు. ఆసుపత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నారు. గూండాలు ఇప్పటికీ మమ్మల్ని చంపుతామంటూ బెదరిస్తున్నారు'' అని కేశవదాసు వెల్లడించారు. పోలీసులు తమకు కొద్దిపాటి భద్రత కల్పించినప్పటికీ, దుండగులను ఇప్పటికీ పట్టుకోకపోవడంతో తాము భయం గుప్పిట్లోనే ఉన్నామని ఆయన చెప్పారు. తమ ఫిర్యాదుతో 10 మంది స్థానిక పోలీసులు ఆలయం వద్ద మోహరించారని, అయినప్పటికీ భయంగానే గడుపుతున్నామని చెప్పారు. ''భారత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రధాని కూడా మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు ప్రధానులు కలిసి ఆదుకోవాలి'' అని కేశవదాస్ విజ్ఞప్తి చేశారు.

Read more