Asteroid that killed dinosaurs: డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలమే.. చంద్రుడిపైనా దాడిచేసిందా?

ABN , First Publish Date - 2022-09-30T00:31:43+05:30 IST

దాదాపు 230 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై నివసించినట్టుగా చెబుతున్న డైనోసార్లు (dinosaurs) ఎలా

Asteroid that killed dinosaurs: డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలమే.. చంద్రుడిపైనా దాడిచేసిందా?

న్యూఢిల్లీ: దాదాపు 230 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై నివసించినట్టుగా చెబుతున్న డైనోసార్లు (dinosaurs) ఎలా మరణించాయన్నది అందరికీ తెలిసే ఉంటుంది. ఓ పెద్ద ఆస్టరాయిడ్ (Asteroid) భూమిని ఢీకొట్టడం ద్వారా అవి అంతమైపోయాయని చెబుతారు. తాజాగా, ఇప్పుడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చైనీస్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రాంలో భాగంగా చంద్రుడిపైకి వెళ్లి చాంగె-5 స్పేస్‌క్రాఫ్ట్(Chang'e-5 spacecraft) తీసుకొచ్చిన చంద్రుడి శాంపిళ్లు ఆశ్చర్యకరమైన వాస్తవాలను వెల్లడిస్తూనే ఉన్నాయి. భూమిని ఢీకొట్టిన అతిపెద్ద గ్రహశకలం(Asteroid) ప్రభావం చంద్రుడిపైనా పడిందన్న దానికి సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. 


భూమిపై తీవ్ర ప్రభావం చూపించిన గ్రహశకలం(Asteroid) ఢీకొట్టిన ఘటన ఒక్క భూ గ్రహానికే పరిమితం కాలేదని, ఇంచుమించు ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయని కర్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి నుంచి మోసుకొచ్చిన లూనార్ శాంపిళ్లలో రెండు బిలియన్ సంవత్సరాల క్రితం నాటి మైక్రోస్కోపిక్ గ్లాస్ బీడ్స్‌ను వారు గుర్తించారు. 2020లో చైనీస్ స్పేస్‌క్రాఫ్ట్ తీసుకొచ్చిన చంద్రుడి శాంపిళ్లపై మరింత లోతైన అధ్యయనం కోసం వీటిని గ్లోబల్ సైన్స్ కమ్యూనిటీకి కూడా అందించారు. మైక్రోస్కోపిక్ గ్లాస్ బీడ్స్ అనేవి ఉల్కా ప్రభావాల వేడి, ఒత్తిడి కారణంగా ఏర్పడతాయని అధ్యయనకారులు చెబుతున్నారు. 


 ‘సైన్స్ అడ్వాన్సెస్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అగ్నిపర్వత విస్ఫోటనాలు, లేదంటే ద్రవీభవన సమయంలో ఏర్పడిన సిలికేట్ గాజు కణాలు అన్ని చంద్రనేలల్లో వ్యాప్తి చెందుతాయి. వీటిని సాధారణంగా బీడ్స్ లేదంటే గోళాలు అని పిలుస్తారు. ఇవి సాధారణంగా కొన్ని పదుల మైక్రోమీటర్ల నుంచి కొన్ని మిల్లీమీటర్ల వరకు ఉంటాయి. గోళాకారం, కోడిగుడ్డు ఆకారం లేదంటే డంబెల్ ఆకారంలో ఉంటాయి. ఈ మైక్రోస్కోపిక్ గ్లాస్ బీడ్స్ ఎప్పుడు? ఎలా? ఏర్పడతాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు విస్తృత శ్రేణి సూక్ష్మ విశ్లేషణ పద్ధతులు, సంఖ్యా మోడలింగ్, జియోలాజికల్ సర్వేలను మిళితం చేసి విశ్లేషించారు. డైనోసార్లు(dinosaurs) ఈ భూమిపై అంతం కావడానికి కారణమైన ‘చిక్సులబ్ ఇంపాక్ట్ క్రేటర్’ సహా లూనార్ గ్లాస్ బీడ్స్ వయసు అతిపెద్ద ప్రభావ బిలం ఘటనల వయసుతో సరిగ్గా సరిపోతాయని కనుగొన్నారు. చాంగే-5 తీసుకొచ్చిన నమూనాల నుంచి సేకరించిన డేటాను ఇప్పుడు ఇతర చంద్రనేలలు, బిలం వయసులతో పోల్చి చూడాలని ఇప్పుడు శాస్త్రవేత్తల బృందం భావిస్తోంది. ఫలితంగా  ఏ ప్రభావాలు భూమిపై జీవాన్ని ప్రభావితం చేశాయో.. అదే ప్రభావం చంద్రుడిపైనా చూపిందా? అన్న విషయాన్ని వెలికి తీసేందుకు సాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  

Updated Date - 2022-09-30T00:31:43+05:30 IST