Himachal Pradesh Assembly election : ‘హిమాచల్‌’.. ఎవరివైపో?

ABN , First Publish Date - 2022-11-12T04:19:39+05:30 IST

హిమాలయ రాష్ట్రం.. పర్యాటకుల స్వర్గధామం.. యాపిల్‌ పంటకు పేరుగాంచిన.. ఒకసారి ఒక పార్టీని.. మరోసారి ఇంకో పార్టీని ఆదరించే హిమాచల్‌ ప్రదేశ్‌లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది.

Himachal Pradesh Assembly election : ‘హిమాచల్‌’..   ఎవరివైపో?

నేడు రాష్ట్రంలోని 68 శాసనసభ స్థానాలకు పోలింగ్‌

అభివృద్ధి ముద్రతో బీజేపీ..

మార్పు కోరుతూ కాంగ్రెస్‌

తూర్పున హస్తానికి..

పశ్చిమంలో కమలానికి పట్టు

రెండు చోట్లా 34 చొప్పున సీట్లు..

మహిళలు కీలకం

బరిలో ఆప్‌.. బెంబేలెత్తిస్తున్న

స్వతంత్రులు, తిరుగుబాటుదార్లు

ఉచిత హామీలతో హోరెత్తించిన పార్టీలు

సిమ్లా, న్యూఢిల్లీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): హిమాలయ రాష్ట్రం.. పర్యాటకుల స్వర్గధామం.. యాపిల్‌ పంటకు పేరుగాంచిన.. ఒకసారి ఒక పార్టీని.. మరోసారి ఇంకో పార్టీని ఆదరించే హిమాచల్‌ ప్రదేశ్‌లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 68 సీట్లకు ఒకే దఫాలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. 55.93 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి అంటూ అధికార బీజేపీ, మార్పు కోరుతూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తించాయి. మధ్యలో నేనున్నానని ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) బరిలో నిలిచింది. ఈ రెండు పార్టీలు అన్ని సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఆప్‌ 67, బీఎస్పీ 53 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. మొత్తం 412 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. వీరిలో 99 మంది స్వతంత్రులున్నారు. అందులోనూ ఏకంగా 27 మం ది రెబెల్స్‌ పోటీ చేస్తుండడంతో జాతకాలు తారుమారు అవుతాయని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దడ పుడుతోంది. స్వతంత్రులు, రెబెల్స్‌ కింగ్‌ మేకర్లుగా మారే అవకాశం ఉందని భావిన్నారు. కాగా, 2017 ఎన్నికల్లో హిమాచల్‌లో 75.57ు పోలింగ్‌ నమోదైంది. బీజేపీ 44, కాంగ్రెస్‌ 21, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి.

మహిళల ఓటింగే కీలకం

మొత్తం అభ్యర్థుల్లో 24 మంది మహిళలు. అభ్యర్థుల సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగంలో మహిళలే ముందుంటున్నారు. 1998 ఎన్నికల నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2017 ఎన్నికల్లో 19.1 లక్షల మంది మహిళలు ఓటేశారు. పురుషులు 18.8 లక్షల మంది మాత్రమే హక్కును వినియోగించుకున్నారు. అతివల ఓటింగ్‌ 6.2 శాతం అధికం. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ, కాంగ్రె్‌సలు తమ మేనిఫెస్టోల్లో మహిళలను ఆకట్టుకునే హామీలిచ్చాయి. బీజేపీ నేరుగా మహిళా మేనిఫెస్టోనే ప్రకటించింది.

ముంచినా.. తేల్చినా పశ్చిమమే

భౌగోళికంగా చూస్తే.. హిమాచల్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో 34 చొప్పున సీట్లున్నాయి. రెండుచోట్లా బీజేపీ, కాంగ్రెస్‌ బలంగా ఉన్నాయి. బిలా్‌సపూర్‌, చంబా, హమీర్‌పూర్‌, కాంగ్రా, ఉనా జిల్లాలతో కూడిన పశ్చిమం బీజేపీ కంచుకోట. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇక్కడివారే. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ 40 శాతం పైగా ఓట్లు సాధిస్తోంది. గత ఎన్నికల్లో 49 శాతం ఓట్లు కొల్లగొట్టింది. కాగా, ఎస్సీ, ఎస్టీల ఆదరణతో తూర్పు ప్రాంతం కాంగ్రె్‌సకు అనుకూలంగా ఉంది. 2007లో తప్ప మిగతా ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ కంటే హస్తానికే ఎక్కువ ఓట్లు పడ్డాయి.

ప్రభుత్వ వ్యతిరేకత.. గ్రూపుల బెంగ

ఐదేళ్ల అభివృద్ధిని చూపుతూ ఓట్లడుగుతున్న బీజేపీ.. అధికార పార్టీపై ఉండే వ్యతిరేకతకు తోడు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పాత పింఛను విధానం పునరుద్ధరణ, రైతాంగ సమస్యలను ఎదుర్కొంటోంది. యాపిల్‌ పండ్ల ప్యాకింగ్‌ అట్టపెట్టలపై 18 శాతం జీఎస్టీ బీజేపీ పట్ల రైతుల్లో ఆగ్రహం పెంచుతోంది. సమర్థ, సమష్టి నాయకత్వం లేని కాంగ్రెస్‌ గ్రూపుల గోలతో సతమతమవుతోంది. ఓపీఎస్‌ అమలు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఉద్యోగాల భర్తీని ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది.

ఉచితాలపై హామీలేహామీలు

ఉచిత పథకాల సంస్కృతి మంచిది కాదని ప్రధాని మోదీ పలుసార్లు పేర్కొన్నప్పటికీ.. హిమాచల్‌లో బీజేపీ దీనికి భిన్నంగా హామీలు ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీని చూసి అంతకుమించి అన్నట్లు ఉచిత వాగ్దానాలు చేసింది. మహిళా సాధికారత పేరుతో విద్యార్థినులు, ముఖ్యమంత్రి అన్నదాత సమ్మాన్‌ నిధి కింద రైతులు, ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనలో మహిళలను ఆకట్టుకునే వాగ్దానాలు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా మహిళలకు నెలకు రూ.1500 చొప్పున నగదు, ఉచిత విద్యుత్తు హామీ లిచ్చింది. కాగా, కొండలు, పర్వతాలతో కూడిన హిమాచల్‌లోనూ ఎన్నికలు ఖరీదైనవిగా మారుతున్నాయి. 2017లో పట్టుబడిన డబ్బు, మద్యం విలువ రూ.9.03 కోట్లు మాత్రమే. ఈ ఎన్నికల్లో ఈ మొత్తం ఐదు రెట్లు పెరిగి రూ.50 కోట్లు దాటడం గమనార్హం.

మెజారిటీ అభ్యర్థులు కోటీశ్వరులే

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులే. కాంగ్రెస్‌కు చెందిన 90 శాతం అంటే 61 మంది, బీజేపీకి చెందిన వారు 82 శాతం అంటే 56 మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ వెల్లడించింది. 67 స్థానాల్లో పోటీచేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లో 35 మంది కోటీశ్వరులు ఉండటం గమనార్హం. 13 మంది బీఎస్పీ అభ్యర్థులు, నలుగురు సీపీఏం అభ్యర్థులు ధనవంతుల జాబితాలోని వారే. మొత్తం బరిలోకి దిగుతున్న 412 మందిలో 226 మంది ఐశ్వర్యవంతులే కావడం గమనార్హం. సిమ్లాలోని చోపల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బల్వీర్‌ సింగ్‌ వర్మ రూ.128 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 66 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

Updated Date - 2022-11-12T04:19:40+05:30 IST