Assam Madrassa : ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న మదరసా కూల్చివేత

ABN , First Publish Date - 2022-08-31T20:45:54+05:30 IST

అల్‌ఖైదా (al-Qaida) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ మదరసాను

Assam Madrassa : ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న మదరసా కూల్చివేత

గువాహటి : అల్‌ఖైదా (al-Qaida) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ మదరసాను అస్సాం ప్రభుత్వం (Assam Government) బుధవారం కూల్చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా పని చేస్తున్న మదరసాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంతో ఈ నెలలో కూల్చివేతకు గురైన మూడో మదరసా (Madrassa) ఇది. 


అస్సాంలోని బొంగాయిగావ్ జిల్లా, కబైటరీ పార్ట్-4 గ్రామంలో ఉన్న మర్కజుల్ మా-అరిఫ్ క్వారియానా మదరసాను బుధవారం కూల్చేశారు. దీని కోసం ఎనిమిది బుల్డోజర్లను వినియోగించారు. మదరసాలోని ఓ బోధకుడు ముఫ్తీ హఫీజుర్ రహమాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెట్ (AQIS) సభ్యుడని పోలీసులు తెలిపారు. ఇతను 2018లో ఈ మదరసాలో బోధకుడిగా చేరినట్లు తెలిపారు. ఈ మదరసాలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో అభ్యంతరకరమైన వస్తువులు, సాహిత్యం బయటపడ్డాయని చెప్పారు. 


రెండంతస్థుల ఈ భవనం ప్రమాదకర పరిస్థితిలో ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఒకే ప్రాంగణంలో, అనేక భవనాలు, లెక్కలేనంత మంది వ్యక్తులతో, అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతి పొందలేదని, ముఖ్యమైన పత్రాలు లేవని తెలిపారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే తప్పించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు లేవని చెప్పారు. దీనిని కూల్చివేయడానికి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీనిలో ఉంటున్న 200 మంది విద్యార్థులను మంగళవారం ఖాళీ చేయించారు. 


Read more