Controversy: కిడ్నాపింగ్ కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి మంత్రిగా ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-08-17T19:53:32+05:30 IST

అపహరణ (Kidnaping) కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం బిహార్‌లో వివాదానికి..

Controversy: కిడ్నాపింగ్ కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి మంత్రిగా ప్రమాణస్వీకారం

పాట్నా: అపహరణ (Kidnaping) కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం బిహార్‌లో వివాదానికి తెరలేపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారంనాడు తన మంత్రివర్గంలోకి 31 మందిని తీసుకున్నారు. ఇందులో 16 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీ ఎమ్మెల్సీ కార్తికేయ సింగ్‌ (Karthikeya Singh) న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఈ వివాదం తలెత్తింది. కిడ్నాపింగ్ కేసులో కార్తికేయ సింగ్ సింగ్ ఈనెల 16న దనపూర్ కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా, ఆయన నేరుగా పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, కళంకిత మంత్రిని క్యాబినెట్‌లోకి తీసుకోవడం నితీష్‌ను ఇరకాటంలోకి నెట్టింది. ''నాకు తెలియదు. దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర లేదు'' అని క్లుప్తంగా ఆయన సమాధానమిచ్చారు.


కార్తికేయ సింగ్‌పై కేసు ఏమిటంటే..

కార్తికేయ సింగ్, మరో 17 మందిపై 2014లో పట్నాలోని బిహ్టా పోలీస్ స్టేషన్‌లో అపహరణ కేసు నమోదైంది. ఒక బిల్టర్‌ను హత్య చేసే ఉద్దేశంతో అతని కిడ్నాప్‌కు కుట్ర పన్నినట్టు కార్తికేయ సింగ్‌పై ఆరోపణ ఉంది. ఈ కేసులో ఆయనపై చార్జిషీటు కూడా నమోదైంది. ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అభియోగాలున్నాయి. 2017 ఫిబ్రవరి 16న ఆయన పాట్నా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. 2022 జూలై 14న ఆయనకు వారెంట్ జారీ అయింది. ఆ  ప్రకారం ఆగస్టు 16న ఆయన లొంగిపోవాల్సి ఉంది. అయితే ఆ పని చేయకుండా ఆయన నేరుగా మంత్రిగా ప్రమాణస్వీకారం కానిచ్చేశారు.


ఎవరీ కార్తికేయ సింగ్?

ఆర్జేడీ ఎమ్మెల్సీ అయిన కార్తికేయ సింగ్ ఆ పార్టీ కోటాలో నితీష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మోకమా నివాసి అయిన ఆయన వృత్తిరీత్యా టీచర్. కాగా, తనపై అన్నీ తప్పుడు కేసులు పెట్టినట్టు ఆయన చెతున్నారు. ''నాపై వారెంట్ ఏమీ లేదు. అఫిడవిట్‌లో పూర్తి సమాచారం ఇచ్చాను'' అని మీడియాకు ఆయన తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన న్యాయశాఖను అప్పగించారు. 


డిస్మిస్ చేయండి: బీజేపీ

కాగా, కార్తికేయ సింగ్‌ను తక్షణం పదవి నుంచి డిస్మిస్ చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ షిండే డిమాండ్ చేసారు. ''కార్తికాయ సింగ్‌పై వారెంట్ జారీ అయివుంటే ఆయన లొంగిపోవాల్సిందే. కానీ ఆయన న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీహార్‌ను తిరిగి లాలూ టైమ్స్‌లోకి తీసుకువెళ్లాలని నితీష్ అనుకుంటున్నారా?'' అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2022-08-17T19:53:32+05:30 IST