Punjab : ‘అగ్నిపథ్’కు అందని సహకారం... ఎంపిక ప్రక్రియను ఆపేస్తామంటున్న సైన్యం...

ABN , First Publish Date - 2022-09-14T16:58:57+05:30 IST

రక్షణ దళాల్లోకి ‘అగ్నిపథ్’ పథకం (Agnipath scheme) ద్వారా

Punjab : ‘అగ్నిపథ్’కు అందని సహకారం... ఎంపిక ప్రక్రియను ఆపేస్తామంటున్న సైన్యం...

చండీగఢ్ : రక్షణ దళాల్లోకి ‘అగ్నిపథ్’ పథకం (Agnipath scheme) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పంజాబ్‌లో స్థానిక అధికార యంత్రాంగం సహకరించడం లేదని భారత సైన్యం (Indian Army) ఆరోపించింది. ఇదే తీరు కొనసాగితే రాష్ట్రంలో ఎంపిక ప్రక్రియను నిలిపేసి, పొరుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. 


పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీకే జంజువా, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఉపాధి సృష్టి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ) కుమార్ రాహుల్‌లకు సెప్టెంబరు 8న జలంధర్‌లోని జోనల్ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్ మేజర్ జనరల్ శరద్ బిక్రమ్ సింగ్ ఓ లేఖ రాశారు. అగ్నిపథ్ పథకంలో నియామకాల కోసం  స్థానిక అధికార యంత్రాంగం నుంచి తమకు సహకారం లభించడం లేదని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని, నిధులు లేవని స్థానిక అధికారులు చెప్తున్నారని తెలిపారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీస్ నిర్వహించడానికి పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం తప్పనిసరిగా సహకరించాలని, ఇది తప్పించుకోవడానికి వీలు కానటువంటిదని తెలిపారు. అభ్యర్థులు సజావుగా ఈ ప్రక్రియలో పాల్గొనే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం, అభ్యర్థులు వరుస క్రమంలో వచ్చే విధంగా నియంత్రించడం భద్రత కల్పించడం వంటి కార్యకలాపాల నిర్వహణకు పోలీసుల సహకారం అవసరమని తెలిపారు. 


అభ్యర్థులకు అవసరమైనపుడు వైద్య సహాయం అందించడానికి అంబులెన్స్, వైద్యుల బృందం అందుబాటులో ఉండాలని తెలిపారు. వర్షంలో తడిసిపోకుండా టెంట్లు, త్రాగునీటి సదుపాయం, మొబైల్ టాయ్‌లెట్లు, సుమారు 4,000 మందికి 14 రోజులపాటు ఆహారం వంటి సదుపాయాలను కల్పించవలసి ఉంటుందని తెలిపారు. 


ఈ అవసరాలను తీర్చేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తాను ఈ విషయాన్ని సైన్యం ప్రధాన కార్యాలయానికి తెలియజేస్తానని చెప్పారు. రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీస్‌ను నిలిపేయాలని కోరుతానని చెప్పారు. ప్రత్యామ్నాయంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహించాలని కోరుతానని తెలిపారు. 


Updated Date - 2022-09-14T16:58:57+05:30 IST