గ్రామీణ భారతంలో నీటి సమస్య!

ABN , First Publish Date - 2022-10-04T07:46:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వం జల జీవన్‌ మిషన్‌, హర్‌-ఘర్‌-జల్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 38 శాతం కుటుంబాలకు కుళాయి కనెక్షన్‌ లేదు. 62 శాతం కుటుంబాలకు

గ్రామీణ భారతంలో నీటి సమస్య!

38% ఇళ్లకు కుళాయి కనెక్షన్‌ లేదు

ఏడాదిలో నీటి వసతి వృద్ధి 14%.. స్పష్టం చేసిన ‘జలశక్తి’ నివేదిక


న్యూఢిల్లీ, అక్టోబరు 3: కేంద్ర ప్రభుత్వం జల జీవన్‌ మిషన్‌, హర్‌-ఘర్‌-జల్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 38 శాతం కుటుంబాలకు కుళాయి కనెక్షన్‌ లేదు. 62 శాతం కుటుంబాలకు మాత్రమే కుళాయి కనెక్షన్‌ ఉంది. అయితే.. వీటికి కూడా.. నీటి సరఫరాలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమృద్ధిగా, నిరంతరాయంగా నాణ్యమైన నీటిని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర జలశక్తి శాఖ పలు కార్యక్రమాలు అమలుచేస్తోంది. అయితే.. ఈ మూడు లక్ష్యాల సాధనలో ఏడాది కాలంలో 14% మాత్రమే పురోగతి కనిపించింది. 2020-21తో పోలిస్తే 2021-22లో 14 శాతం కొత్తగా కుళాయి కనెక్షన్లను ఇవ్వగలిగారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నాణ్యమైన నీటిని అందిస్తున్న రాష్ట్రాల్లో పుదుచ్చేరి 88 శాతంతో తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు(86%), హిమాచల్‌ ప్రదేశ్‌(82%), గోవా(81%), తెలంగాణ(80%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో రాజస్థాన్‌ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇక, 40 శాతంతో కేరళ, మణిపూర్‌, అండమాన్‌, నికోబార్‌ దీవులున్నాయి. త్రిపురలో41%, మహారాష్ట్రలో43%, మధ్యప్రదేశ్‌లో47% సరఫరా మాత్రమే ఉండడం గమనార్హం. 


జల జీవన్‌ మిషన్‌ లక్ష్యం ఇదీ..

2024 నాటికి దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు.. సురక్షిత తాగునీటిని కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ అందించడం జలజీవన్‌ మిషన్‌ ప్రధాన లక్ష్యం. 2019, ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


  • ప్రస్తుతం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 19.1 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. 
  •  జల జీవన్‌ మిషన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 7 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. 
  •  2019, ఆగస్టు 15 నాటికి 3.2 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్‌ ఉండగా, ఈ ఏడాది సెప్టెంబరు 29 నాటికి ఇది 10.2 శాతానికి చేరింది. అంటే.. మొత్తంగా 54 శాతం ఇళ్లకు కుళాయి నీరు అందుతోంది. 
  • జల జీవన్‌ మిషన్‌ కింద థర్డ్‌పార్టీ నేతృత్వంలో ఈ సర్వే నిర్వహించారు.

Updated Date - 2022-10-04T07:46:17+05:30 IST