రాజీవ్‌గాంధీలా మోదీని హత్యచేయాలనుకున్నారు

ABN , First Publish Date - 2022-02-19T09:14:28+05:30 IST

ఎల్గార్‌ పరిషద్‌’ కేసులో నిందితులు ముగ్గురు... సాగర్‌ గోర్ఖే, రమేశ్‌ గైచోర్‌, జ్యోతి జగ్‌త్‌పలకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు బెయిలును ...

రాజీవ్‌గాంధీలా మోదీని హత్యచేయాలనుకున్నారు

 ఎల్గార్‌ పరిషద్‌ కేసు నిందితులు దేశంలో అలజడి సృష్టించాలని చూశారు: ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు.. బెయిల్‌ నిరాకరణ 

ముంబై, ఫిబ్రవరి 18 : ‘ఎల్గార్‌ పరిషద్‌’ కేసులో నిందితులు ముగ్గురు... సాగర్‌ గోర్ఖే, రమేశ్‌ గైచోర్‌, జ్యోతి జగ్‌త్‌పలకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు బెయిలును నిరాకరించింది. ఈ ముగ్గురు నేతలు.. నిషేధిత  మావోయిస్టు పార్టీతో కలిసి దేశంలో అలజడిని సృష్టించేందుకు, మోదీని గద్దె  దింపేందుకు ‘తీవ్రమైన కుట్ర’ పన్నారని కోర్టు పేర్కొంది. ఈ మేరకు కోర్టు వద్ద లిఖిత పూర్వక ఆధారాలు ఉన్నట్టు తెలిపింది. ఈ కారణంగానే బెయిల్‌ ఇవ్వడంలేదని పేర్కొంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంఽధీని మట్టుపెట్టినట్టుగానే ప్రధాని మోదీ రోడ్డు షోలను లక్ష్యంగా చేసుకుని ఆయనను హత్యచేయడానికి పథకరచన చేశారని న్యాయమూర్తి జస్టిస్‌ డీఈ కొథాలికర్‌ తెలిపారు. కబీర్‌ కళామంచ్‌ సభ్యులైన ముగ్గురు నిందితులు ఎల్గార్‌ పరిషద్‌ సమావేశంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు ఆధారాలున్నాయని అన్నారు. కాగా, సెప్టెంబరు 2020లో అరెస్టయిన గోర్ఖే, గైచోర్‌, జగ్‌తప్‌ ఇంకా కస్టడీలోనే ఉన్నారు. డిసెంబరు 31, 2017న పుణేకు సమీపంలో నిర్వహించిన ఎల్గార్‌ పరిషద్‌ సదస్సులో పాల్గొన్న వక్తల ఉద్రేకపూరిత ప్రసంగాల వల్లే కొరేగావ్‌ భీమా వద్ద విధ్వంసం చోటుచేసుకుందంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎల్గార్‌ పరిషద్‌ వెనక మావోయిస్టులున్నారని కూడా పేర్కొన్నారు. ఈ కేసులో విరసం సభ్యుడు వరవరరావు సహా పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలను నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత దర్యాప్తును ఎన్‌ఐఏకి బదిలీ చేశారు. 

Read more