అధికార ‘మత్తు’లో కేజ్రీవాల్‌

ABN , First Publish Date - 2022-08-31T08:38:17+05:30 IST

‘‘ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార మత్తులో తూలుతున్నారు. ఆయన రాసిన ‘స్వరాజ్‌’ పుస్తకంలో మద్యం విధానంపై పేర్కొన్న ఆదర్శాలను పూర్తిగా మరిచిపోయారు. లోక్‌పాల్‌ కోసం

అధికార ‘మత్తు’లో కేజ్రీవాల్‌

మద్యం విధానంపై అన్నాహజారే మండిపాటు


పుణె, ఆగస్టు 30: ‘‘ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార మత్తులో తూలుతున్నారు. ఆయన రాసిన ‘స్వరాజ్‌’ పుస్తకంలో మద్యం విధానంపై పేర్కొన్న ఆదర్శాలను పూర్తిగా మరిచిపోయారు. లోక్‌పాల్‌ కోసం కృషిచేయడం.. పటిష్ఠ లోకాయుక్త చట్టాన్ని తీసుకురావడం.. అవినీతిని అంతమొందించడం వంటి సిద్ధాంతాలను పక్కన పెట్టేశారు. అవినీతి మద్యం పాలసీని తీసుకొచ్చారు’’ అంటూ సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఢిల్లీ మద్యం పాలసీపై విమర్శలను ఎక్కుపెడుతూ.. హిందీలో రాసిన బహిరంగ లేఖలో సీఎం కేజ్రీవాల్‌ను దునుమాడారు. మద్యం మాదిరిగానే అధికారం కూడా సీఎం కేజ్రీవాల్‌ను మత్తులో ముంచెత్తినట్లు కనిపిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీపై ఇటీవల వెలువడిన వార్తాకథనాలపై కలత చెందాను.


ఓ మంచి లక్ష్యంతో ఆవిర్భవించిన ఆప్‌ ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీల్లా మారిపోయింది’’ అని లేఖలో వ్యాఖ్యానించారు. గతంలో కేజ్రీవాల్‌ రాసిన ‘స్వరాజ్‌’ పుస్తకంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆ పుస్తకంలో మద్యం విధానాలపై పేర్కొన్న ఆదర్శాలకు తిలోదకాలిచ్చారని అన్నారు. బలమైన లోక్‌పాల్‌, లోకాయుక్తాలను తీసుకురావడాన్ని పక్కనబెట్టి.. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తీసుకువచ్చారు. ఇలాంటి మద్యం విధానం దేశంలో ఎక్కడా లేదు’’ అని అన్నా హజారే విమర్శించారు.


హజారేను బీజేపీ వాడుకుంటోంది: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20: మద్యం పాలసీ విషయంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై కేసు నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తులో తేల్చిందేమీ లేదని, అందుకే బీజేపీ ఇప్పుడు అన్నాహజారేను వాడుకుంటోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శించారు. మంగళవారం అన్నా హజారే తనకు లేఖ రాయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిసోడియాకు సీబీఐ అనధికారికంగా క్లీన్‌ చీట్‌ ఇచ్చిందని.. అయినా.. రాజకీయ ఒత్తిళ్లతో వారం, పదిరోజుల్లో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్నారు. 

Updated Date - 2022-08-31T08:38:17+05:30 IST