AIADMK: వారసత్వ పోరులో కీలక మలుపు

ABN , First Publish Date - 2022-08-18T13:41:09+05:30 IST

అన్నాడీఎంకే వారసత్వపోరులో కీలక మలుపు చోటు చేసుకుంది. జూన్‌ 23న, జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాలు

AIADMK: వారసత్వ పోరులో కీలక మలుపు

- ఆ రెండు సర్వసభ్యమండలి సమావేశాలు చెల్లవు

- నెలరోజుల్లోగా మళ్ళీ సమావేశం

- ఈపీఎస్‌ ఎంపిక, నియామకాల రద్దు

- జంట నాయకత్వమే కొనసాగింపు

- హైకోర్టు తీర్పు


చెన్నై, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే వారసత్వపోరులో కీలక మలుపు చోటు చేసుకుంది. జూన్‌ 23న, జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాలు చెల్లవని, పార్టీ నియమావళి ప్రకారం సమన్వయకర్త, ఉపసమన్వయకర్త సంయుక్తంగా నెలరోజుల్లోగా మళ్ళీ సర్వసభ్యమండలి సమావేశం జరపాలని మద్రాసు హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. జూలై 11న మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) నేతృత్వంలో జరిగిన సర్వసభ్యమండలి సమావేశం చేసిన తీర్మానాలు కూడా చెల్లవని, పార్టీలో జూన్‌ 23కు ముందున్న పరిస్థితే కొనసాగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రన్‌(High Court Judge Justice Jayachandran) బుధవారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకేలో జంట నాయకత్వం మళ్లీ అమలులోకి వచ్చినట్లయింది. గతంలో అన్నాడీఎంకే నిర్వహించిన రెండు సర్వసభ్యమండలి సమావేశాలు చెల్లుబాటవుతాయని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణన్‌రామసామి వెలువరించిన తీర్పులను సవాల్‌ చేస్తూ ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam) సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యవహారంపై హైకోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఓపీఎస్‌, అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సభ్యుడు వైరముత్తు హైకోర్టులో రివ్యూ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై న్యాయమూర్తి జయచంద్రన్‌ ఈ నెల 10, 11 తేదీల్లో విచారణ జరిపి తీర్పును బుధవారం వెలువరించారు. 


తొలగింపులు, ఎంపికలు చెల్లవు...

 పార్టీ సమన్వయకర్త పదవి నుంచి ఓపీఎ్‌సను తొలగించడం, అదే విధంగా ఈపీఎస్‌ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక, పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా తమిళ్‌మగన్‌ హుసేన్‌ ఎంపిక కూడా చెల్లవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అన్నాడీఎంకే పార్టీ నియయావళి ప్రకారం అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని నోటీసు జారీ చేసిన ముప్పై రోజుల్లోగా జరపాలని, సమన్వయకర్త ఓపీఎస్‌, ఉపసమన్వయకర్త ఈపీఎస్‌ కలిసి ఆ సమావేశాన్ని నిర్వహించాలని తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. సర్వసభ్యమండలి సమావేశం జరగటానికి 15 రోజులకు ముందు గా మండలి సభ్యులకు ఆహ్వానాలు పంపాలని, సర్వసభ్యమండలి సమావేశాన్ని నిర్వహించేందుకు ఓ కమిషనర్‌ను నియమించనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.


ఈ తీర్పు కార్యకర్తలకు అంకితం: ఓపీఎస్‌

ప్రత్యర్థి వర్గం జరిపిన సర్వసభ్యమండలి సమావేశాలు చెల్లవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అన్నాడీఎంకేకు చెందిన 1.5కోట్ల మంది కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ప్రకటించారు. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం మెరీనాబీచ్‌లోని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొద్ది నెలలుగా పార్టీలో అసాధారణ పరిస్థితులు కొనసాగాయని, పార్టీలో జూన్‌ 23కు ముందున్న పరిస్థితులే కొనసాగాలని హైకోర్టు సుస్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. పార్టీలో మొదటి నుండి కార్యకర్తలకే అగ్రతాంబూలమని, వారి అభిప్రాయాలకనుగుణంగానే తీర్పు వచ్చిందన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని పార్టీకి పూర్వవైభవం కల్పిస్తానని ఆయన శపథం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను అనుగుణంగా పార్టీ భవిష్యత్‌ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 


ఓపీఎస్‌ నివాసం ఎదుట సంబరాలు...

హైకోర్టు తీర్పు అనంతరం గ్రీన్‌వేస్ రోడ్డు(Greenways Road)లోని ఓపీఎస్‌ నివాసం వద్ద మద్దతుదారులు, కార్యకర్తలు బాణ సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సుమారు వందమందికిపైగా కార్యకర్తలు ఓపీఎస్‌ చిత్రపటాలను, రెండాకుల ప్లాస్టిక్‌ జెండాలు పట్టుకుని నృత్యం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

Updated Date - 2022-08-18T13:41:09+05:30 IST