India and Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన... హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2022-09-07T20:11:08+05:30 IST

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) భారత్ పర్యటన, కాంగ్రెస్ నేత

India and Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన... హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు...

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) భారత్ పర్యటన, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ భారత దేశాన్ని విభజించిందని, దేశాన్ని సమైక్యపరచాలని రాహుల్ గాంధీ కోరుకుంటే, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను తిరిగి కలిపేసి, అఖండ భారత్ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. 


హిమంత బిశ్వ శర్మ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత దేశం సమైక్యంగానే ఉందన్నారు. కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు, సిల్చార్ నుంచి సౌరాష్ట్ర వరకు మనం ఐకమత్యంగానే ఉన్నామన్నారు. కాంగ్రెస్ భారత దేశాన్ని భారత్, పాక్‌లుగా విభజించిందన్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పాటైందన్నారు. తన తాతగారు జవహర్లాల్ నెహ్రూ పొరపాటు చేశారని రాహుల్ గాంధీ భావిస్తే, భారత భూభాగంలో భారత్ జోడో యాత్ర చేయడంలో అర్థం లేదన్నారు. అఖండ భారత్‌ను ఏర్పాటు చేసేందుకు భారత దేశంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను కలిపేయడానికి కృషి చేయాలన్నారు. 


హిమంత బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీకి సైద్ధాంతిక ప్రేరణనిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అఖండ భారత్ గురించి చెప్తుంది. ప్రస్తుత భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్, టిబెట్, మయన్మార్ కలిసి అఖండ భారత్‌గా ఏర్పడాలని చెప్తుంది. 


బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా మంగళవారం భారత దేశ పర్యటనకు వచ్చారు. ఆమె నాలుగు రోజులపాటు మన దేశంలో పర్యటిస్తారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. 


Updated Date - 2022-09-07T20:11:08+05:30 IST